
‘చెప్పే మనిషి.. వినే టైమ్‌ను బట్టి విషయం విలువే మారిపోతుంది’.. ఈ డైలాగ్ ఒక సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినది. దీని అర్థాన్ని విశదీకరిస్తే.. ఏదైనా విషయాన్ని చెప్పే మనిషికున్న విలువకు.. అదే విషయాన్ని వివరించే కాలానికి అనుగుణంగా దాని అర్థం మారిపోతుందని.. అంటే ఒకే విషయం వివిధ సందర్భాలలో, అప్పుడున్న కాలానికి అనుగుణంగా అర్థం అవుతుందని.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ‘ఆది శంకరాచార్యులు’ గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుకువస్తుంది.
‘జగద్గురువు’ ఆది శంకరాచార్యులు దళితుల విషయంలో ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని ఎంపీ శశిథరూర్ ఒక వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు. ఆది శంకరాచార్యులు 10వ శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుద్ధరించిన మహనీయుడని శశిథరూర్ తొలుత పేర్కొన్నారు. ఒకరోజు ఆది శంకారాచార్యులు ఒక ఇరుకైన నది దాటుతున్నప్పుడు ఆయనకు ఒక ఛండాలుడు(దళితుడు) అడ్డుగా వస్తాడు. వెంటనే శంకరాచార్యులు అతనని అడ్డు తొలగాలని ఆజ్ఞాపిస్తారు. తాను మహనీయుడననే ఉద్దేశంతో శంకరాచార్యుడు ఆ విధంగా ఆదేశిస్తారు.
The more I hear him the more I like him. pic.twitter.com/3l2S8QQpMj
— दीपक प्रभु (@ragiiing_bull) July 5, 2025
అయితే ఆ ఛండాలుడు కదలకుండా అక్కడే నిలుచుని శంకరాచార్యులను ఇలా ప్రశ్నిస్తాడు. ‘మీరు నా శరీరాన్ని తొలగిపొమ్మంటున్నారా లేదా ఆత్మను తొలగిపొమ్మంటున్నారా? అని అంటూ.. మన ఇద్దరి ఆత్మ ఒక్కటే కదా?" అని అడుగుతాడు. ఈ ప్రశ్న శంకరాచార్యులను తీవ్ర ఆలోచనకు గురిచేస్తుంది. అనంతరం ఆయన ఆత్మ సమానత్వంపై అంగీకారం తెలియజేస్తారు. ఆత్మ స్థాయిలో అందరూ సమానమేనని, దళితుడు కూడా అందరితో సమానమేనని ఆది శంకరాచార్యులు గుర్తిస్తారు. వెంటనే శంకరాచార్యులు ఆ దళితుడి పాదాలకు ప్రణమిల్లుతూ.. నా బోధనలను నా శిష్యుల కంటే మీరు చక్కగా అర్థం చేసుకున్నారని ప్రశంసిస్తారు.
ఈ సంఘటనను చెప్పిన శశిథరూర్ అన్ని జీవరాశులు ఒకే ఆత్మలోని భాగాలేనని, ఇవన్నీ బ్రహ్మలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. జన్మ ఆధారంగా వివక్షకు తావులేదని శశిథరూర్ స్పష్టం చేశారు. శశి థరూర్.. శంకరాచార్యులు జీవించిన కాలంలోని సామాజిక సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ కాలంలో కుల వ్యవస్థ బలంగా ఉండేదని, వాటి సంస్కరణల కోసం ఆయన చర్యలు తీసుకోలేదని, ఆయన దృష్టి ప్రధానంగా ఆధ్యాత్మిక, తాత్త్విక బోధనలపైనే ఉందన్నారు. ఆయన తాత్త్వికంగా సమానత్వాన్ని బోధించినప్పటికీ, సామాజిక ఆచారాలకు కొంతవరకు కట్టుబడి వ్యవహరించారని శశిథరూర్ వ్యాఖ్యానించారు.