వైఎస్ వివేకా కేసులో తనపై నిందలేశారన్న సీఐ శంకరయ్య
తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందన్న ప్రచారంపై కలత.. దు్రష్పచారంతో పరువు నష్టం కలిగించారని ఆవేదన
మానసిక వేదనకు గురి చేశారని నోటీసులు
నాకే నోటీసులిస్తావా అంటూ కళ్లెర్ర చేసిన సీఎం చంద్రబాబు
ఫలితంగా పగబట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి ప్రతినిధి కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లు సీఎం స్థాయిలో చంద్రబాబు తననుద్దేశించి అసెంబ్లీలో మాట్లాడటం తీవ్రంగా బాధించిందన్న సీఐ శంకరయ్యను ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనపై అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానంగా దక్కింది. తనకు ప్రమోషన్ రాకపోయినా, వచ్చినట్లు ప్రచారం చేయడం అబద్ధం అని చెప్పినందుకు సర్కారు కక్షగట్టిందని ఇట్టే స్పష్టమవుతోంది.
తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదన్న నిరంకుశ ప్రభుత్వ దమననీతికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సీఐ జె.శంకరయ్యను బాబు సర్కార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించింది. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
అబద్ధాలొద్దన్నందుకు కక్షగట్టారు
2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పోలీసు అధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లో చేరిన శంకరయ్య అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ కడప వీఆర్‌కు వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు సంబం«ధించి అనుసరించిన వైఖరి ఫలితంగానే సీఐగా ఉన్న శంకరయ్యకు డీఎస్పీగా పదోన్నతి లభించిందని సీఎం చంద్రబాబు పదేపదే అసెంబ్లీలో ప్రస్తావించారు.
బాబు మాటలపై శంకరయ్య తీవ్రంగా కలత చెందారు. చేయని తప్పునకు అవమానాలపాలు కావాల్సి వస్తోందని మదనపడ్డారు. ఈ నేపథ్యంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని తన న్యాయవాది ద్వారా సీఎంకి నోటీసులు పంపారు. తనకు పదోన్నతి కల్పించకపోయినా కల్పించినట్లు పదేపదే అబద్ధాలు చెప్పడం సరికాదని నోటీసుల్లో ప్రస్తావించారు. తనను మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలన్నారు.
గుడ్లురిమిన పెద్దలు.. ఉద్యోగం ఉఫ్..
తనకు పదవులు దక్కకపోయినా దక్కినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని సీఐ శంకరయ్య ప్రశ్నించినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. శంకరయ్య వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో ఎస్‌ఐగా పనిచేశారు. ఆ తర్వాత సీఐగా కర్నూలు జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, కడప వీఆర్, అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పని చేశారు.
విధి నిర్వహణలో రాజీ పడకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిగా పోలీసు శాఖలో గుర్తింపు పొందారు. సీఐ డిస్మిస్ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని పోలీసులు విస్తుపోతున్నారు.


