ప్రైవేటుకే ‘అసైన్డ్‌’ | YS Jagan gave rights to assigned lands and made them freehold | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకే ‘అసైన్డ్‌’

Nov 22 2025 5:04 AM | Updated on Nov 22 2025 5:04 AM

YS Jagan gave rights to assigned lands and made them freehold

పేదల భూములపై ఉక్కుపాదం 

ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం 

ఆర్డినెన్స్‌ జారీకి కసరత్తు.. ఇటీవలే కేబినెట్‌లో ఆమోదం.. ఈ ఫైలును అత్యవసరంగా కేబినెట్‌ ముందుకు సర్క్యులేట్‌ చేయించిన సీఎం  

అసైన్డ్‌ భూములకు హక్కులిచ్చి ఫ్రీ హోల్డ్‌ చేసిన వైఎస్‌ జగన్‌  

వాటిని ఎడాపెడా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పన్నాగం 

ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్రీ హోల్డ్‌ చేసిన అసైన్డ్‌ భూములను వివాదంగా మార్చిన వైనం.. 16 నెలలుగా వాటిని 22–ఏ జాబితాలో పెట్టిన బాబు సర్కారు  

ఇప్పుడు ఏకంగా వాటిని ఇష్టం వచ్చినట్లు ప్రైవేటుకు ఇచ్చేందుకు బరితెగింపు 

సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ దాహం ఎంతకీ తీరడం లేదు. విలువైన ప్రభుత్వ భూములు, మెడికల్‌ కాలేజీలు, టూరిజం శాఖ హరిత రిసార్టులను ఇష్టానుసారంగా ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు కట్టబెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. తాజాగా గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై పడ్డారు. ఆ భూములను వెనక్కు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అసైన్డ్‌ భూములపై రైతులకు హక్కులిచ్చి, ఫ్రీ హోల్డ్‌ చేసి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ 2024 జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిని మళ్లీ 22–ఏ జాబితాలో పెట్టి వారి నడ్డి విరిచారు. ఇప్పుడు ఏకంగా ఆ భూములను ప్రైవేటుకు ఇచ్చేందుకు అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరణ చేయనున్నారు. 

పేదలకు మేలు చేయకపోగా, వారి హక్కులను కాలరాస్తూ వారి నోటి దగ్గర కూడు లాక్కునేలా అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుని, ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు 1977 అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరిస్తూ ఈ నెల 10వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

గంటల వ్యవధిలో సర్క్యులేట్‌.. ఆమోదం 
తాజాగా టీడీపీ ప్రభుత్వ పెద్దలు పేదల అసైన్డ్‌ భూములను సైతం కంపెనీల పరం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మెడికల్‌ కాలేజీలు, టూరిజం శాఖ హరిత రిసార్టులు, పలుచోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు యథేచ్చగా పంపిణీ చేస్తున్న చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు పేదల భూములను లాక్కునేందుకు మరింతగా బరి తెగించింది. 

ఈ చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు గత నెల 3వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్‌ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు.  మంత్రివర్గ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు వీలుగా సీఎం చంద్రబాబు అత్యవసరంగా ఈ ముసాయిదా బిల్లును సర్క్యులేట్‌ చేయించారు. ఆ తర్వాత వెంటనే దాన్ని ఆమోదించేశారు. ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. త్వరలో ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీ అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన భూములు సైతం..
1977 అసైన్డ్‌ భూముల చట్టం ప్రకారం పేదలకు అసైన్‌ చేసిన భూములను అమ్మడం గానీ, లీజుకివ్వడం కానీ చేయకూడదు. ప్రజోపయోగ అవసరాలకు సైతం ఈ భూములను తీసుకోవడం కష్టమే. కానీ ఇప్పుడు జారీ చేయబోయే ఆర్డినెన్స్‌ ద్వారా ఈ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చిన భూములను సైతం అసైన్డ్‌ పరిధి నుంచి మినహాయించవచ్చు. 

ప్రభుత్వం నామమాత్రంగా డబ్బులు కట్టించుకుని ఇచ్చిన భూములు, హౌసింగ్‌ బోర్డు లాంటి వాటి ద్వారా ఇచ్చిన భూములను అసైన్డ్‌ చట్టం పరిధి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అసైన్డ్‌ భూములను ఎవరికీ బదలాయించకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తే గతంలో తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చట్ట సవరణ ద్వారా వెనక్కు తీసుకోవడంతోపాటు ఆ భూములను ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. 

అసైన్డ్‌ రైతులు తమ భూములను అమ్ముకోవడంపై నిషేధం ఉండగా, ప్రభుత్వం అనుమతిస్తే ఆ అమ్మకం చట్టబద్ధమయ్యేలా మార్పు చేశారు. ఇందుకోసం అసైన్డ్‌ చట్టంలోని సెక్షన్‌ 2(6), సెక్షన్‌ 3 (2), సెక్షన్‌ 3 (2ఎ)ని సవరించారు. ఈ సవరణల ద్వారా తమకు అవసరమైన చోట అసైన్డ్‌ భూములను వెనక్కు తీసుకుని, ప్రజోపయోగం పేరుతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 

గ్రీన్‌ ఎనర్జీ, ప్రైవేటు పరిశ్రమలు, ప్రైవేటు పార్కులకు 99 సంవత్సరాల లీజుకు అసైన్డ్‌ భూములు ఇచ్చేందుకే సీఎం చంద్రబాబు అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్‌ తెచ్చారని స్పష్టమవుతోంది. రోజుల వ్యవధిలోనే పలుచోట్ల అసైన్డ్‌ భూములను ఈ పరిశ్రమలకు ఇచ్చేందుకు ఇప్పటికే ఫైళ్లు వాయు వేగంతో నడుస్తున్నాయి. 

తప్పుదారి పట్టించి.. పేదల నోట్లో మట్టి
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దీన్ని తప్పుదారి పట్టించి.. ఫ్రీ హోల్డ్‌ భూముల్లో అక్రమాలు జరిగాయని 16 నెలలుగా వాటిని 22ఏ జాబితాలో పెట్టారు. అనేక సంవత్సరాల తర్వాత తమ భూములపై తమకు హక్కులు వచ్చాయనే ఆనందం పేద రైతులకు లేకుండా చేశారు. ఆ భూముల అక్రమాలు తేలుస్తామంటూ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సమీక్షలు, సమావేశాలు, వెరిఫికేషన్ల పేరుతో లక్షలాది మంది రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. 

తమ భూములను 22–ఏ జాబితా నుంచి తీసి వేయాలని వారు వేడుకుంటున్నా, పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా వాటిని లాక్కునేందుకు గుట్టుచప్పుడు కాకుండా అసైన్డ్‌ చట్టాన్ని సవరించడానికి సిద్ధమయ్యారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ ఫ్రీ హోల్డ్‌ భూముల విషయంలో చంద్రబాబు సర్కారు ఆడిన నాటకం అంతా ఆ భూములను లాక్కునేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది.

జగన్‌ హక్కులిస్తే.. బాబు లాక్కుంటున్నారు
భూమి లేని నిరుపేదలు బతకడం కోసం ప్రభుత్వాలు వారికి భూములు అసైన్‌ చేశాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల భూములను వివిధ ప్రభుత్వాలు పేదలకు కేటాయించాయి. అయితే ఆ భూములను సాగు చేసుకుని జీవనోపాధి పొందడం మినహా అమ్మడానికి వారికి హక్కులు లేవు. దీంతో తమకు వాటిపై హక్కులు కల్పించాలని ఎన్నో దశాబ్దాలుగా పేదలు ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు.

అయితే ఏ ప్రభుత్వం వారి అభ్యర్థనను మన్నించలేదు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు పేద దళిత రైతులకు మేలు చేసేందుకు అసైన్డ్‌ భూములపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. విస్తృత అధ్యయనం తర్వాత ప్రజా ప్రతినిధుల కమిటీ సిఫారసుల ఆధారంగా..  అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములను సంబంధిత రైతులు, లేదా వారి వారసులు అమ్ముకునేందుకు 1977 అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ చేశారు. 

తద్వారా రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల వివాదాలకు చరమగీతం పాడారు. అసైన్డ్‌ రైతుల చిరకాల కోరికను నెరవేర్చి, వారిని అందరి మాదిరిగా సగర్వంగా నిలబెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏకంగా 9.35 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించారు. రాష్ట్రంలో అసైన్డ్‌ భూములకు సంబంధించి జరిగిన తొలి సంస్కరణ ఇదే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement