మంత్రి అండతో రెచ్చిపోయిన సీఐ ఇస్మాయిల్
క్రమశిక్షణ చర్యలకు ఆదేశించిన జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ
సాక్షి, నంద్యాల: కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు బలవుతున్నారు. అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ ఓపెన్ చేసిన ఓ సీఐను జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ తీవ్రంగా మందలించింది. దీనికి సంబంధించిన వివరాలివీ.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరీం తన స్నేహితుడు, నంద్యాలలోని అలీనగర్‌కు చెందిన చికెన్ షాప్ నిర్వాహకుడు మెహతార్ జాహీద్‌కు గతేడాది రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి స్వల్ప ఘర్షణ జరిగింది.
ఈ దాడిపై గతేడాది డిసెంబర్‌లో కరీం రెండో పట్టణ సీఐగా పనిచేస్తున్న ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు జాహీద్ మంత్రి అనుచరులను ఆశ్రయించడంతో టీడీపీ కార్యాలయం నుంచి సీఐకి సిఫారసు వెళ్లింది. దీంతో సీఐ ఇస్మాయిల్ ఆగమేఘాల మీద కరీంపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారు. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి ఎదుట కరీంను హాజరుపరచగా సెక్షన్ల చూసిన జడ్జి, కరీంకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని ఆదేశించారు.
దీంతో చేసేదేమీ లేక కరీంను వదిలేశారు. దీనిపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి రెచ్చిపోయిన సీఐ ఇస్మాయిల్, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేశారనే కారణంతో పాటు అనుమతి లేకుండా ధర్నాలు చేశారనే అభియోగాలు నమోదుచేసి కరీంపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీంతో తనపై అక్రమంగా తప్పుడు కేసులు నమోదు చేశారని సీఐ ఇస్మాయిల్‌పై చర్యలు తీసుకోవాలని జనవరిలో జిల్లా పోలీస్ కంప్లెంట్ అథారిటీని కరీం ఆశ్రయించారు.
నలుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. అనంతరం సీఐ ఇస్మాయిల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధర్మాసనం చైర్మన్ వెంకట రమణారెడ్డి ఈనెల 14న తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు.


