సాక్షి, విశాఖ: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని, ఇందుకు మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ చేసిన నిర్వాకమే నిదర్శనమని వైఎస్సార్ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. సంధ్యారాణి పీఏ సతీష్ ఒక మహిళను పక్కలోకి రావాలని వేధించాడని, ఆమె నుంచి ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు.
బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమంటున్నాడని, ఆమెను వేధించిన పీఏకు మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తున్నారని కళ్యాణి ఆరోపించారు. మంత్రి పీఏపై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. కాగా బాధితురాలు మంత్రి లోకేష్ కు సతీష్‌పై ఫిర్యాదు చేసిందని, అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పీఏ కు సపోర్ట్ చేసిన మంత్రి సంధ్యారాణిని వెంటనే బర్త్ రఫ్ చేయాలని కల్యాణి డిమాండ్ చేశారు. మంత్రి పీఏ మహిళలను వేధిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళా రక్షణ అనేది కేవలం మాటలకే పరిమితమా? ఒక మహిళను మంత్రి పీఏ వేధింపులకు గురి చేస్తుంటే, హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని కల్యాణి నిలదీశారు. వెంటనే మంత్రి పీఏ సతీష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి


