విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీలో విద్వేషాలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.
మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్‌ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.
రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగం
ఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.
ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్‌ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు.


