- మైలవరంలో వరుస ఘటనలు
- రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే వివాదాలంటూ విమర్శలు
ఆస్తుల ముందు.. రక్త సంబంధాలు, పేగు బంధాలు, దాంపత్య బాంధవ్యాలు కూడా నిలవడం లేదు. ఆస్తుల కోసం, భూముల కోసం మనిషి మృగంలా మారుతున్నాడు. క్షణికావేశంలో కన్నవారు, తోబుట్టువులు అనేది కూడా చూడటం లేదు. తన అవసరాల కోసం భూమిని అమ్మకోనీయలేదని తండ్రిని చంపిన కొడుకు.. తండ్రికి ఆస్తిలో వాటా పంచలేదని నాయనమ్మని చంపిన మనవడు.. తన పేరుమీద భూమి రాయలేదని తండ్రిపై దాడికి తెగబడిన కొడుకు.. భూమి కోసం మహిళపై దాడి చేసిన భర్త వైపు బంధువులు.. భూ వివాదంలో బంధువులతో కొట్లాటకు దిగిన రెవెన్యూ అధికారి..
ఇలాంటి హృదయ విదారక ఘటనలు చూసి, సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది.. ముఖ్యంగా మైలవరం నియోజక వర్గంలో ఆస్తుల కోసం దాడులు, హత్యలు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
జి.కొండూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రభుత్వ పాలనను విజయవాడ నుంచి కొనసాగించడం వల్ల విజయవాడకు ఆనుకొని ఉన్న మైలవరం నియోజకవర్గంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 2,48,195.51ఎకరాలుగా ఉండగా, వ్యవసాయ భూమి 38,200హెక్టార్లు ఉంది. అయితే ఇటీవల అమరావతి రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక గ్రాఫిక్స్‌లను విడుదల చేయడంతో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందన్న ఆశ స్థానికుల్లో రెట్టింపైంది. ఈ ఆశతో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు ఇష్ట పడటంలేదు. ఈ క్రమంలో దారుల విషయమై, సరిహద్దుల విషయమై వివాదాలు జరుగుతున్నాయి.
అంతే కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో వాటాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిసలైన వారసులు చేసిన అప్పులు తీర్చలేక భూములు అమ్మేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. భూ వివాదాలపై కుటుంబ సభ్యులు ఆవేశాలకు పోకుండా ఆలోచనతో మాట్లాడుకొని పరిష్కరించుకోవడంతో పాటు ఫిర్యాదులు అందగానే రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా వెంటనే స్పందిస్తే వివాదాలు కొంత మేర తగ్గే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
భూ వివాదాల్లో దాడులు మచ్చుకు కొన్ని..
∙మైలవరం మండల పరిధి బొర్రాగూడెం గ్రామానికి చెందిన పొన్నూరు సత్యనారాయణకు గ్రామంలో 2.10ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తన పేరుమీద రాయాలంటూ గత కొంత కాలంగా రామ్‌కిరణ్ తండ్రి సత్యనారాయణపై గొడవ పడుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ భూమిలో ఉన్న మామిడి చెట్లను కలప కోసం తండ్రికి తెలియకుండా రూ.1.15లక్షలకు రామ్‌కిరణ్ విక్రయించాడు. ఈ విషయమై ఈ నెల 24వ తేదీన తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రామ్‌కిరణ్ తండ్రిపై దాడికి తెగబడ్డాడు. అదే సమయంలో రామ్‌కిరణ్ పక్కనే ఉన్న సత్యనారాయణ మేనల్లుడు కోడూరు నవీన్ సైతం దాడికి సహకరించడంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.
∙ఈ నెల 17వ తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామంలో భూ వివాదమై, జరిగిన దాడిలో గ్రామానికి చెందిన ఆంగోతు జయ గాయాలతో మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మద్యం మత్తులో ఉన్న తన భర్త నుంచి సంతకాలు సేకరించిన భర్త వైపు కుటుంబ సభ్యులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణను అడ్డుకున్నందుకు తనపై దాడి తెగబడ్డారని మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ వివాదాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు.
మైలవరం మండల పరిధి మొర్సుమల్లి పంచాయతీలోని ములకలపెంట గ్రామానికి చెందిన కడియం పుల్లారావు చెడు వ్యసనాలకు బానిసై భారీగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముతానంటూ తండ్రి శ్రీనివాసరావు(57)కి చెప్పడంతో అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాయంత్రం తండ్రి పొలంలోకి వెళ్లిన సమయంలో కర్రతో దాడి చేసి తండ్రిని హతమార్చి జైలుపాలయ్యాడు.
∙భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారే భూ వివాదంలో బంధువులతో కొట్లాటకు దిగడం విస్మయానికి గురి చేసింది. మైలవరం మండల పరిధి దాసుళ్లపాలెం గ్రామంలో భూ వివాదమై ఈ నెల 25వ తేదీన వీఆర్‌ఓ వింజమూరి లక్ష్మయ్య, ఆయన బంధువు చక్రవర్తి కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో వీఆర్‌ఓ లక్ష్మయ్య, చక్రవర్తిలకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
∙తన తండ్రికి ఆస్తిని పంచడం లేదనే కోపంతో జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి శివసచీ్చంద్ర కుమార్ కొడుకు వేణుగోపాలరావు తన నాయనమ్మ ఉమ్మడి హైమావతి(65)ని జూలై 1వ తేదీన ఉదయం పొలంలో పశువులను మేపుతుండగా కర్రతో దాడి చేసి స్పృహ కోల్పోయిన తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగలబెట్టాడు.
కొట్లాట పరిష్కారం కాదు..
సరిహద్దులు, దారుల సమస్యలు ఉన్నప్పుడు ఇరువర్గాలు రెవెన్యూ శాఖను సంప్రదించి పరిష్కరించుకోవాలి. వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు ఉంటే కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. భూ వివాదాలు ఉన్నప్పుడు ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇగోలకు పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే కేసులలో ఇరుక్కుపోతారు. దాడుల వల్ల ఇరు వర్గాల కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతారు.
– రావూరి రమేష్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మైలవరం


