
ఏటా వర్షాకాలంలో సర్వీసుల నిలుపుదల
ఈ ఏడాది ముందుగానే మొదలైన వర్షాలు
పదిరోజులుగా ముంబైలో ఎడతెగని వానలు
ముందుజాగ్రత్త చర్యగా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మారిటైం బోర్డు ప్రకటన
కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు
గేట్ వే ఆఫ్ ఇండియా–మాండ్వాల మధ్య సోమవారం నుంచి లాంచి సేవలను నిలిపివేశారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు లాంచి యజమానులు సేవలు నిలిపివేశారు. దీంతో నిత్యం ఈ మార్గంలో లాంచీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకనుంచి ఎక్కువ చార్జీలు చెల్లించి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. లాంచీ సేవలు మళ్లీ సెప్టెంబరు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లాంచీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ మహాడ్కర్ తెలిపారు. ముంబై పరిసరా ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పక్షం రోజుల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ నుంచి లాంచి సేవలు నిలిపివేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది. ఏటా వర్షా కాలంలో జూన్ ఒకటో తేదీ నుంచి లాంచీ సేవలు నిలిపివేస్తారు. కానీ ఈసారి వర్షాలు తొందరగా ప్రారంభం కావడంతో వారం రోజుల సర్వీసులను నిలిపివేశారు.

రోరో సేవల కొనసాగింపు...
ముంబైకి సమీపంలో ఉన్న వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అలీబాగ్ ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ 90 శాతం పర్యాటకులు లాంచీలను ఆశ్రయిస్తారు. రోడ్డు మార్గం కంటే సముద్ర మార్గం ద్వారా అలీబాగ్‌కు చేరుకోవడం చాలా సులభం. బస్సు చార్జీలతో పోలిస్తే లాంచీ చార్జీలు చాలా తక్కువ. గేట్ వే ఆప్ ఇండియా–మాండ్వా మ«ధ్య ప్రతీరోజు 40–50 లాంచీలు నడుపుతారు. వర్షాకాలంలో సముద్రంలో అలలు ఉవ్వేత్తున ఎగిసిపడతాయి. ముఖ్యంగా హై టైడ్ కారణంగా లాంచీలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈసారి ముందుగానే వర్షాలు మొదలుకావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే లాంచీ సర్వీసులను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే భావుచా ధక్క–మాండ్వా మధ్య రోల్ ఆన్–రోల్ ఆఫ్ (రోరో) సేవలు కొనసాగుతాయని మారిటైం బోర్డు తెలిపింది.
ఉపాధి..ఆదాయానికి గండి....
గేట్ వే–మాండ్వా మధ్య పీఎన్‌పీ, మాల్దార్, అజంత, అపోలే కంపెనీల లాంచీలు సేవలందిస్తున్నాయి. దాదాపు మూడు నెలలకుపైగా లాంచిసేవలు నిలిచిపోనుండటంతో వీటి యజమానులు, అక్కడి హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల యజమానుల ఆదాయానికి గండిపడనుంది. ముంబై నుంచి బయలుదేరే పర్యాటకులతోపాటు అలీబాగ్ నుంచి ముంబైకి వచ్చే వ్యాపారులు, ఉడ్యోగుల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. ఇకనుంచి వీరంతా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడున్నదైనప్పటికీ తప్పదని అధికారులు అంటున్నారు.
కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు
మోకాల్లోతులో నీటిలో ఆసుపత్రుల ప్రధాన భవనాలు, పరిసరాలు
వరదనీటిలోనే రోగుల క్యూ

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. వర్షాల కారణంగా కేఈఎం, జె.జె. ఆసుపత్రులు నీట మునిగాయి. పరేల్‌లోని కేఈఎం ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం , పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వద్ద అలాగే కొన్ని రోగుల గదుల వెలుపల భా రీగా నీరు నిలిచిపోయింది. టాటా ఆసుపత్రి, కేఈఎం ఆసుపత్రి, వార్డు 4ఏ వరండాల్లో నీరు చేరింది. నీటి పంపులతో వెంటనే నీటిని తొల గించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. ఇక జె.జె. ఆసుపత్రిలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ప్రధాన భవనం వెలుపల, అలాగే ఆసుపత్రి నివాస భవనాల పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ కోసం వచ్చిన రోగులు నీటిలోనే నిలబడాల్సి వచ్చింది. అవుట్ పేషెంట్ భవనం నుంచి ప్రధాన భవనానికి వెళ్లే రోగులు పూర్తిగా నీటిలోనే నడవాల్సి వచి్చంది. జె.జె. ఆసుపత్రి సమీ పంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం, ప్రజా పనుల విభాగం ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అ యితే గత సంవత్సరం లాగా ఆసుపత్రి భవనం ఈసారి పూర్తిగా నీటమునగలేదని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జె.జె. ఆసుపత్రి డీన్ డాక్టర్ అజయ్ భండార్వర్ తెలిపారు.