ఖాన్ స‌ర్‌.. గొడవ‌లొద్దు | MP Pappu Yadav request Khan Sir show your big heart | Sakshi
Sakshi News home page

ఖాన్ స‌ర్‌.. వివాదాన్ని ముగించండి

Jun 4 2026 6:13 PM | Updated on Jun 4 2026 6:32 PM

MP Pappu Yadav request Khan Sir show your big heart

ఎంపీ పప్పు యాదవ్ విజ్ఞ‌ప్తి

పట్నా: ఉపాధ్యాయులు విద్వేషాల‌కు దూరంగా ఉండాల‌ని జన అధికార్ పార్టీ అధినేత, పూర్నియ‌ పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్ వేడుకున్నారు. బిహార్‌లోని పట్నాలో కాదంఖాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాన్‌ గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. పెద్ద మ‌న‌సు చేసుకుని ఈ వివాదాన్ని ఇంత‌టితో ముగించాల‌ని ఖాన్ స‌ర్‌ను (Khan Sir) కోరారు. ఎవరి విషయంలోనైనా త‌న వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కాళ్లు ప‌ట్టుకుని తాను క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అన్నారు. ఖాన్ సర్, రోషన్ సర్ ఇద్దరూ త‌న‌కు సోద‌ర స‌మానులేన‌ని.. వీరిద్ద‌రికీ త‌న హృదయంలో స్థాన‌ముంద‌ని పేర్కొన్నారు.  

ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, వివాదానికి ముగింపు ప‌ల‌కాల‌ని పప్పు యాదవ్ విజ్ఞ‌ప్తి చేశారు. విద్యా రంగంలో ఉన్నవారు ద్వేషాన్ని కాకుండా సంభాషణను, సామరస్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇద్దరు విద్యావేత్త‌ల‌ మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న వాగ్వివాదం, ఆరోపణలు బిహార్ విద్యా సంస్కృతికి మంచి సంకేతం కాదని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదంతా వ‌ద్దు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయవద్దు, విద్వేషాలు రెచ్చగొట్టవద్దు.. ఒక వ్యక్తి తప్పు చేయవచ్చు కానీ మొత్తం సమాజాన్ని, భావజాలాన్ని నిందించడం సరికాదని ఎంపీ పప్పు యాదవ్ ఉద్వేగభరితంగా చెప్పారు.

బిహార్ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య అనేది సమాజాన్ని ఏకం చేసే సాధనమని.. ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు సమాజంలో విభజన లేదా విద్వేషాన్ని సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బిహార్ బలం ప్రతిభ, విద్య, సామాజిక ఐక్యతలో ఉందని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని ఆయన అన్నారు.

బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి
గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడిపై పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేయాల‌ని, బాధ్యుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు పప్పు యాదవ్ తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అన్నారు. ఇటీవ‌ల రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన విద్యార్థిని మృతి కేసు నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌రల్చ‌డానికి కోచింగ్‌ సెంటర్‌పై దాడిని పెద్ద‌దిగా చూపిస్తున్నార‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. విద్యార్థిని మృతి కేసులో దోషులు త‌ప్పించుకోకుండా చూడాల‌ని, చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష ప‌డాల్సిందే అన్నారు. విద్యార్థిని మృతి కేసుపై రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు.

చ‌ద‌వండి: అది స‌రిపోదు.. మంత్రి రాజీనామా చేయాల్సిందే

కోచింగ్‌ సెంటర్‌పై దాడి అందుకే
గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై మరో కోచింగ్‌ సెంటర్‌పై మంగళవారం రాత్రి 10.10 గంటల ప్రాంతంలో దాడి జ‌రిగింది. కోచింగ్‌ సెంటర్‌ వద్ద కాపలాగా ఉన్న గార్డ్‌ను చితకొట్టి భవనం మీదకు పలువురు రాళ్ల వర్షం కురిపించారు. డైరెక్టర్‌ సహా పలువురు దాడికి దిగి విధ్వసం సృష్టించారు. కాల్పులు సైతం జరిపారని ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు, విద్యావేత్త ఫైసల్‌ ఖాన్‌ ఆరోపించారు. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తున్నామనే అక్కసుతో వేరే కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు దాడిచేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటలో వేరే కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రోషన్‌ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. దాదాపు 20 మంది ఈ దాడి ఘటనలో పాల్గొన్నారని, ఆర్థిక కోణంలోనూ దర్యాప్తు ఆరంభించామని పట్టణ డీఎస్పీ రాజేశ్‌ రంజన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement