కాంగ్రెస్ ఎంపీ సాగర్ ఖాండ్రే డిమాండ్
బెంగళూరు: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ సాగర్ ఖాండ్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఇటువంటి కీలక అంశాలపై ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వారిని వెంటనే దేశద్రోహులు లేదా ఎవరికో ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారని వాపోయారు. బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులను చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ అది సరిపోదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సాగర్ ఖాండ్రే డిమాండ్ చేశారు.
అధిష్ఠానానికి కృతజ్ఞతలు
డీకే శివకుమార్ కేబినెట్‌లో తన తండ్రి ఈశ్వర్ ఖాండ్రేకు చోటు దక్కడంపై ఆయన సంతోషం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఈశ్వర్ ఖాండ్రే సమర్థవంతంగా పనిచేశారని, ఆయన పనితీరు, పార్టీ పట్ల అంకితభావాన్ని గుర్తించి కేబినెట్‌లో చోటు కల్పించారని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు మరింత కట్టుబడి పనిచేస్తామని సాగర్ ఖాండ్రే (Sagar Khandre) స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతమే లక్ష్యం: ఈశ్వర్ ఖాండ్రే
డీకే శివకుమార్ మంత్రివర్గంలోనూ తనకు చోటు దక్కడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖాండ్రే (Eshwar Khandre) హర్షం ప్రకటించారు. ఈరోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
“నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మా నాయకత్వానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. గతంలో కూడా నేను నా బాధ్యతలను నిజాయితీగా, చిత్తశుద్ధితో, అంకితభావంతో, కష్టపడి నిర్వర్తించాను. ఈసారి కూడా అదే నిబద్ధతతో పని చేస్తాను” అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.


