రుణమాఫీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేయాలి

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

రాయచూరు రూరల్‌: కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతు రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు మస్తాన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదన్నారు. దీంతో రైతులు రుణాలు చెల్లించే స్థితిలో లేరన్నారు. తొలకరి వర్షాలకు సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రాయచూరును కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరి మృతి

హొసపేటె: ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం కూడ్లిగి తాలూకాలోని గూడెకోట సమీపంలో గూడెకోట–మొళకల్మూరు రహదారి పై ఉన్న దురుగమ్మ దేవస్థానం వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. దురుగమ్మ గుడి సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌లో వెళ్తుండగా.. కరిబసప్ప అనే బైకర్‌ అతివేగంగా వచ్చి వారి బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం మొలకల్మూరు ఆస్పత్రికి తరలించారు. కరిబసప్ప మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. గాయపడిన ముజమిల్‌ బేగ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గూడెకోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మద్దతు ధర ప్రకటించాలి

రాయచూరు రూరల్‌: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులు మద్దతు ధర లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ బి.వి.నాయక్‌ కోరారు. రైతులు విక్రయించిన జొన్న పంట డబ్బును వెంటనే ఖాతాల్లోని జమ చేయాలని మాన్వి బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మాన్వి వద్ద రాయచూరు–సింధనూర్‌ రహదారిని బంద్‌ చేసి ఆందోళన చేపట్టారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్‌ నివేదికలను అమలు చేయాలన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆహర పౌర సరఫరాల శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బసన గౌడ, నాగలింగ స్వామి, వీరభద్ర గౌడ, సుభాష్‌ చంద్ర, రవి కుమార్‌, హనుమేష నాయక్‌, మల్లన గౌడ, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాధాకృష్ణ నీటిపారుదల ప్రాజెక్టుతో కర్ణాటకు నష్టం

రాయచూరు రూరల్‌: మహారాష్ట్ర ప్రభుత్వం కొల్హాపూర్‌ జిల్లాలో కృష్ణా నదిపై కొత్తగా రాధాకృష్ణ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించడానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీనిపై దిగువ రాష్ట్రాలైన కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొల్హాపూర్‌ జిల్లాలోని ఇచల్‌కరంజి పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో ఈ కొత్త జలాశయాన్ని నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కార్‌ సిద్ధమైంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది నుండి సుమారు 4 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. కొల్హాపూర్‌ జిల్లాలోని కీలక ప్రాంతాలకు తాగునీటి ఎద్దడిని తీర్చడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివకుమార్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవిస్‌ ఇటీవల ఇచ్చల కరంజీలో జరిగిన సభలో లేఖలు రాసినట్లు సమాచారం. రాధాకృష్ణ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మిస్తే హిప్పరిగి బ్యారెజీకి నీటి ప్రవాహం తగ్గుతుందని కన్నడ పర సంఘటనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement