హుబ్లీ: స్థానిక కేశ్వపుర రమేష్ భవన్ దగ్గర ఓ ఇంట్లో ఎలక్ట్రిటిక్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కిరణ్ శావి (21) మృతి చెందాడు. కరెంట్ పని కోసం కిరణ్.. రమేష్ శెట్టి ఇంటికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఎటువంటి సురక్షిత పరికరాలు ఇవ్వకుండా సదరు కాంట్రాక్టర్ రాఘవేంద్ర ఘరుడా, అలాగే ఆ ఇంటి యజమాని రమేష్ శెట్టిపై మృతుడి తల్లి నీలమ్మ కేశ్వపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వ్యక్తిపై
సోడా బాటిల్‌తో దాడి
హుబ్లీ: స్థానిక చెన్నపేటలో రేణుకా బార్‌లో చిన్న కారణానికి ఆగ్రహానికి గురైన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై సోడా బాటిల్‌తో దాడి చేసి చాకుతో పొడిచారు. స్థానిక కర్కి బసవేశ్వర నగర పరశురామ కిమకేరి దాడికి గురైన వ్యక్తి. బారులో స్థలం విడువమన్న కారణంగా పరశురామ్‌తో ఆ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. అసభ్యంగా తిడుతూ సోడా బాటిల్‌తో కొట్టి కత్తితో పొడిచి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పరశురామ కసబాపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చికిత్స పొందుతూ
యువకుడు మృతి
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరిలో సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఈనెల 18న అణ్ణిగేరి ఉదయ్ నగర్‌లోని ఓ గీజర్‌కు అమర్చిన సిలిండర్ పేలింది. సహిరబాను, ఆమె పిల్లలు అబ్బాస్ అలీ, అస్సన్ సాబ్‌కు 80 శాతం శరీర భాగాలు కాలాయి. అస్సన్ సాబ్ (27) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ఇద్దరు కేఎంసీ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
తప్పిన భారీ ప్రమాదం
హొసపేటె: విజయనగర జిల్లా హడగలి పట్టణంలోని జీబీఆర్ కళాశాల వద్ద గురువారం ఉదయం వాహనం నుంచి సీఎన్‌జీ ఇంధనం లీక్ కావడంతో భయాందోళన నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతానికి పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం ముఖ్య అధికారి ముత్తురాజ్, సిబ్బంది ఇంధన లీకేజీని అరికట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


