బళ్లారి అర్బన్: కురుగోడు తాలూకా తిమ్మలాపురలోని సర్వే నంబర్లు 51ఏ1/ఏ2, 51/21 భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకం, రవాణా ఆరోపణలతో తనపై తప్పుడు కేసు పెట్టారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నారని దళిత యువ నాయకుడు హెచ్.ఎం.గురుమూర్తి ఆరోపించారు. గురువారం బళ్లారి జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ప్రెస్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏళుబెంచి గ్రామానికి చెందిన బ్యాళె శరణప్ప, బ్యాళె ముదియప్ప, వేణి వీరాపుర గ్రామానికి చెందిన కే.కరిబసప్ప, తిమ్మలాపుర గ్రామానికి చెందిన గోసుబాళ గూల్పె, స్వారె బసవరాజ్ తదితరులు తప్పుడు కేసు నమోదు చేయించడమే కాకుండా, మీడియా ద్వారా కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసు శాఖను కోరారు. సమావేశంలో హనుమంతప్ప, వెంకటేష్, కెంచప్ప, షేక్ వలీ, మహ్మద్ అలీ, బసవరాజ్, దనప్ప, బాలప్ప నళీన్ తదితరులు పాల్గొన్నారు.
బసవన్న కాలువలో
శిశువు మృతదేహం
హొసపేటె: నగర కేంద్రం గుండా వెళ్లే బసవన్న కాలువలో ఒక నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానికుల సహకారంతో శిశువు మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయమై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శిశువును కాలువలో పడేసిన వారిని కనుక్కునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
హొసపేటె: విజయనగర జిల్లాలోని ఆరు తాలూకాలను తక్షణమే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట రైతులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ (హుచవ్వనహళ్లి మంజునాథ వర్గం) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ (డీసీ) కవితా ఎస్.మన్నికేరికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.పరశురామ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది రుతుపవనాలు పూర్తిగా విఫలం కావడంతో పంటలు నిలువునా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టంపై తక్షణమే సంయుక్త సర్వే నిర్వహించాలని, ఎకరాకు తగిన నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంఘం కార్యదర్శి దేవరామనే మహేష్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లిందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
గొర్రెల కాపరికి
నీట్‌లో 694 ర్యాంక్
రాయచూరు రూరల్: ఓవైపు గొర్రెలు కాస్తూ.. మరోవైపు చదువుకుంటున్న గొర్రెల కాపరికి నీట్‌లో ఆల్ ఇండియా స్థాయిలో 694 ర్యాంక్ లభించింది. కొప్పళ జిల్లా హనమనహళ్లి తాలూకాకు చెందిన పుట్టరాజ్.. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ గొర్రెలు మేపేందుకు వెళ్తున్నాడు. వీరికి అడవిలో చిన్న పూరి గుడిసె ఉండగా.. విద్యుత్ సౌకర్యం లేదు. పుట్టరాజ్ 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు హనుమనహళ్లి, బేవూర్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఇంటర్ గంగావతిలో చదువుకుని.. నీట్‌కు చక్కగా ప్రిపేర్ అయ్యాడు. నీట్ రీఎగ్జామ్‌లో పుట్టరాజ్‌కు ఆల్‌ఇండియాలో 694 ర్యాంక్ రావడంతో తల్లిదండ్రులు సావిత్రి, మహబళేష్ సంతోషం వ్యక్తం చేశారు.


