డబ్బు ఇస్తేనే బీ ఖాతాలకు రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

డబ్బు ఇస్తేనే బీ ఖాతాలకు రిజిస్ట్రేషన్‌

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

సాక్షి, బళ్లారి: ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిమయంగా మారిపోయాయి. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించుకుని లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాఫీగా సాగుతున్న ఆర్‌ఎస్‌ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆపేశారు. ఏడాది క్రితం బీ ఖాతా నిబంధనలు అమల్లోకి రాగా.. బీ ఖాతా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారు. బీ ఖాతాలు చేయించుకున్న ఇంటి స్థలాలు, ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. అయితే బీ ఖాతా చేయించుకున్న స్థల యజమానులు ప్లాట్లను అమ్మడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్తే పనులు జరగడం లేదు. అక్కడ అధికారులకు చేతులు తడిపితేనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే ఆర్‌ఎస్‌ ఇంటి స్థలాల ధరలు అంతంత మాత్రమే పలుకుతున్నాయి. ఈ తరుణంలో గోరుచుట్టుపై రోకటిపోటులా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. వారి అవినీతి అక్రమాలను అడిగే వారే లేకుండా పోవడంతో ఒక్కో స్థలానికి రూ.10 వేల నుంచి రూ 20 వేల వరకూ లంచం వసూలు చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని సమాచారం. ఒక్క బళ్లారి జిల్లాలోనే కాకుండా జిల్లాలోని కంప్లి, కురుగోడు, సిరుగుప్ప, సండూరు తదితర ఐదు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా అవినీతి రాజ్యమేలుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసతుల కొరత..

సబ్‌ రిజిష్ట్రేషన్‌ కార్యాలయ అవరణలో మంచినీటి కొరత ఉంది. నీటి కుళాయిలు, మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేయలేదు. మరుగు దొడ్లు అధ్వానంగా ఉన్నాయి. టాయిలెట్స్‌లో నీరు లేకపోవడంతో దుర్వాసన వస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ పనిపై మహిళలు కార్యాలయానికి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రూ.కోట్ల ఆదాయం వచ్చే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కనీస వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు.

లోకాయుక్తకు ఫిర్యాదు

బళ్లారి నగరంతో పాటు జిల్లాలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలపై సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని నూతన జిల్లా అధికారి కార్యాలయ ఆవరణలో లోకాయుక్త అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అవినీతి బాగోతాలపై లోకాయుక్త అధికారులు ఇన్‌స్పెక్టర్లు గుర్రన్న హెబ్బాళ, సురేష్‌ వావిమనేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినా బీ ఖాతాలకు ప్రభుత్వ రుసుం కట్టినప్పటికి అఽధికారులు వేలాది రూపాయలు లంచం అడుగుతున్నారని తెలిపారు. డబ్బు ఇవ్వకపోతే ఎదో ఒక మెలిక పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని పేర్కొన్నారు. బళ్లారిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నగర నడిబొడ్డున ఉండటంతో విపరీతమైన జన సందడి ఉంటుందన్నారు. ఆవరణ లోపల పత్రాలు రాసే అంగళ్ల నుంచి నెలనెల బాడుగ కూడా వసూలు చేయడం లేదని తెలిపారు.

నిబంధనలు బేఖాతరు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి

అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు

పట్టించుకోని ఉన్నత స్థాయి అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement