చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత అమానుషంగా హత మార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు మహిళల సంబంధం గురించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్, వేదవతి(పేరు మార్చడం జరిగింది)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఐదు నెలల బాబు ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ పసివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తల్లి మాత్రం.. పాలు ఇస్తుండగా ఊపిరాడక పిల్లాడు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె మాటను నమ్మి.. బాబుది సహజ మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు.
ఫొటోలు, వీడియోలు..
ఇదిలా ఉండగా.. బాబు చనిపోయిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పును సురేష్ గమనించాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ చెక్ చేయగా, అందులో ఉన్న ఫొటోలు చూసి షాక్ అయ్యాడు. ఆమె మరో మహిళ అయిన సుమిత్రతో ప్రేమలో ఉందని, వీరిద్దరి మధ్య స్వలింగ సంబంధం కొనసాగుతోందని సురేష్ గుర్తించాడు. వారిద్దరికి సంబంధించిన వీడియోలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు.

భర్త సురేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించారు. దీంతో, ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. అయితే, అంతకుముందు సురేష్, తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అనంతరం, ఆమె కొంతకాలం తన పుట్టింట్లో ఉంది. కుటుంబ పెద్దల పంచాయతీ తర్వాత తిరిగి భర్త ఇంటికి వచ్చింది. కానీ, రెండు రోజుల క్రితం భర్త, కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో భారతి తన పసివాడికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇది సుమిత్ర సూచన మేరకే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



