వడగాడ్పులకు 100 మంది బలి! | Sakshi
Sakshi News home page

వడగాడ్పులకు 100 మంది బలి!

Published Mon, Jun 19 2023 5:23 AM

Morethen 100 die as India struggles with a sweltering heatwaves - Sakshi

బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి.

ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్‌ జయంత్‌ కుమార్‌ తెలిపారు.

మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్‌ కుమార్‌ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు.  వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు.  

ఆజంగఢ్‌ డివిజన్‌ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్‌ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్‌ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్‌ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది.

సీఎంఎస్‌ తొలగింపు
బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌(సీఎంఎస్‌) డాక్టర్‌ దివాకర్‌ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ  ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్‌ ఎస్‌కే యాదవ్‌కు సీఎంఎస్‌ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు.  

బిహార్‌లో 44 మంది..
బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది.

Advertisement
Advertisement