
2024–25లో 8.39 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు
ఇందులో పన్ను చెల్లించిన వారు 33.5% మాత్రమే
గణనీయంగా పెరిగిన అధిక వేతన వర్గాలవారు
ఆర్జిస్తున్న ఆదాయం వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఈ స్థాయిలో రిటర్నులు నమోదయ్యాయంటే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరిందని భావిస్తే పొరపాటే. ఎందుకంటే వీరిలో పన్నులు చెల్లించింది.. మూడింట ఒక వంతు మాత్రమే!
ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఆదాయం ఆర్జించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) సమర్పించాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్లకుపైగా వ్యక్తులు తమ ఆదాయపు పన్ను వివరాలను ఐటీ శాఖకు సమర్పించారు. 2019–20లో ఈ సంఖ్య 6.47 కోట్లు. అయిదేళ్లలో ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య సుమారు 30 శాతం పెరిగింది.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవానికి 2024–25లో ఐటీఆర్ దాఖలు చేసినవారిలో పన్నులు చెల్లించింది 33.56 శాతం.. అంటే సుమారు 2.82 కోట్ల మంది మాత్రమే. దాదాపు 5.6 కోట్ల మంది పన్ను పరిధిలో లేరు! అంటే.. వీరి ఆదాయం..పన్ను చెల్లించే స్థాయిలో లేదన్న మాట. ఇలాంటి ఐటీఆర్‌లు ఏకంగా 66.44 శాతం ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.
వేతనాలు పెరిగాయ్
డిడక్షన్‌పోను రూ.15–50 లక్షల ఆదాయం పరిధిలోకి వచ్చిన వేతన జీవుల సంఖ్య 2024–25లో 29.5 లక్షలుగా నమోదైంది. 2019–20లో ఇది 13.1 లక్షలు మాత్రమే. అంటే అయిదేళ్లలో రెండింతలకుపైగా పెరిగింది. అలాగే రూ.7.5–15 లక్షల ఇన్ కం పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 62 శాతం అధికం అయింది. రూ.7.5 లక్షలలోపు ఆదాయ విభాగంలోకి వచ్చినవారు 2.8 శాతం క్షీణించడం గమనార్హం.
టాప్‌లో మహారాష్ట్ర
ఐటీ రిటర్నుల దాఖలులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2024– 25లో అక్కడ ఏకంగా కోటీ 27 లక్షలకుపైగా ఐటీఆర్ ఫైల్ చేశారు. తరువాతి స్థానాల్లో యూపీ, గుజరాత్ ఉన్నాయి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరంలో 30,56,867 మంది ఐటీఆర్ దాఖలు చేశారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 41.6 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లలో ఐటీఆర్ సమర్పించిన వారి సంఖ్య 23 శాతం అధికమై 25,59,092 చేరింది. ఇక పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారి సంఖ్య పరంగా మహారాష్ట్ర ముందంజలో ఉంది.
మహమ్మారి తర్వాత ఎకానమీ గాడిలో పడింది. కంపెనీలు తమ ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ సైతం అందించాయి. నిపుణుల వేతనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ప్రభుత్వ కఠిన నిబంధనలతో ఆదాయ వివరాలను పారదర్శకంగా వెల్లడించాల్సిందే. ఐటీఆర్ ఫైలింగ్స్‌లో ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. – అరుణ్ లాల్, డైరెక్టర్, ఆంబర్ కార్పొరేట్ సర్వీసెస్