లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్‌.. కవితకు కొత్త టెన్షన్‌! | MLC Kavitha Approached Court Over CBI Investigation In Liquor Scam Case | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్‌.. కవితకు కొత్త టెన్షన్‌!

Apr 6 2024 12:15 PM | Updated on Apr 6 2024 1:20 PM

MLC Kavitha Approached Court Over CBI Investigation In Liquor Scam Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస​ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఈరోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక, ఈ అంశంలో తన రిప్లై ఇచ్చేందుకు సమయంలో ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో, సీబీఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్‌ పదో తేదీకి వాయిదా వేసింది. అనంతరం, అప్పటి వరకు స్టేటస్‌ కో మెయింటైన్‌ చేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. 

సీబీఐకి స్పెషల్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
ఇదిలా ఉండగా.. లిక్కర్‌ స్కాం కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది.

సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement