ముంబై రోడ్లపై భిక్షాటన చేస్తూ దొరికిన మెడికో | Missing for 47 days medical student found begging on Mumbai streets | Sakshi
Sakshi News home page

ముంబై రోడ్లపై భిక్షాటన చేస్తూ దొరికిన మెడికో

May 24 2026 1:36 PM | Updated on May 24 2026 3:24 PM

Missing for 47 days medical student found begging on Mumbai streets

నాందేడ్‌: మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి 47 రోజుల పాటు అదృశ్యమై, చివరకు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడు, ఇన్ని రోజుల తరువాత తన కుటుంబానికి చేరువకావడంతో స్థానికలు కంట తడి పెట్టుకున్నారు.

నాందేడ్ జిల్లాకు చెందిన అభయ్ సురేష్ బెల్కోని, హోమియోపతి మెడిసిన్ (బీహెచ్‌ఎంఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్‌లోని తన కళాశాలకు బయలుదేరిన అభయ్, దారిలో తన బ్యాగ్, ఫోన్ ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకున్నాడు. తరువాత ముంబైకి చేరుకున్న అతను, ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అభయ్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6 నుండే తీవ్ర ఆందోళన చెందుతూ, మే 16న తమ్సా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముంబై పోలీసుల చొరవతో..
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన యాంటీ-బెగ్గింగ్ (బిచ్చగాళ్లపై) డ్రైవ్‌లో అభయ్ పోలీసులకు దొరికాడు. అతను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, మానసిక పరిస్థితి సరిగా లేక తన గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. అయినప్పటికీ, పోలీసులు ఎంతో ఓపికగా ప్రయత్నించి, అతని పేరు, ఊరు వివరాలను సేకరించారు. ఆ వివరాలను నాందేడ్ పోలీసులకు తెలియపరచగా, అతను గల్లంతైన విద్యార్థి అని నిర్ధారణ అయ్యింది. అభయ్ దొరికిన విషయాన్ని పోలీసులు అతని తండ్రికి తెలియజేశారు. 47 రోజుల సుదీర్ఘ వేదన తర్వాత, తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement