మీనాక్షికి క్రాస్‌ఓటింగ్‌ గండం | Meenakshi Natrajan will not be able to win Rajya Sabha election | Sakshi
Sakshi News home page

మీనాక్షికి క్రాస్‌ఓటింగ్‌ గండం

Jun 8 2026 4:46 AM | Updated on Jun 8 2026 4:46 AM

Meenakshi Natrajan will not be able to win Rajya Sabha election

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్‌ను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడుతోంది.   మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్‌ చుగ్, రజనీష్‌ అగర్వాల్‌ పోటీకి దిగారు. కాంగ్రెస్‌ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్‌ బరిలో నిలిచారు. 

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది.

 ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్‌ మంత్రి కైలాష్‌ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేత నరేష్‌ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్‌ ఓటింగ్‌ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్‌లో ఆందోళనను మరింత పెంచింది. 

Advertisement
 
Advertisement
Advertisement