breaking news
Rajya Sabha elections seat
-
మీనాక్షికి క్రాస్‌ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్‌ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్‌లో ఆందోళనను మరింత పెంచింది. -
రాజ్యసభ సీటా... నాకొద్దుబాబు
ఎన్నికల్లో పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా నిలబడాలంటే ... అధిష్టానం మొప్పు పొందాలి. కరెన్సీ నోట్లు వెదజల్లాలి. ఇంకా మాట్లాడితే అదృష్టం కూడా కలసి రావాలి. నిద్రాహారాలు మాని ప్రచారం చేయాలి. ఇంత చేసి ఎన్నికల్లో గెలిస్తే ఓకే. ఓ వేళ ఓడిపోతే ఇంతే సంగతులు. ఈ కష్టం అంతా ఎందుకు రాజ్యసభ సీటు ఇస్తే ఏకంగా వెళ్లి పెద్దల సభలో కాలుమీద కాలు వేసుకుని కూర్చోవచ్చని పలువురు ఆశిస్తుంటారు. ఓ వేళ ఆ అవకాశం అదృష్టం కొద్ది తలుపు తడితే ఎవరైనా ఎగిరి గంతు వేస్తారు. కానీ ఓ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం కేబినెట్లోని మంత్రిగారి భార్యకు రాజ్యసభ సీటుని ఆఫర్ చేసింది. అయితే ఆ ఆఫర్‌ను సదరు మంత్రిగారి భార్య తొసిపుచ్చింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలు... కానీ రాజ్యసభ సీటు కంటే నా కుటుంబంతో గడపడమే నాకు అతి మఖ్యమని భావిస్తున్నానని ప్రకటించింది. దీంతో సదరు మంత్రిగారు భార్య నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వం కంగుతింది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రంలో సీఎం అఖిలేష్ యాదవ్ కేబినెట్లోని అజాంఖాన్ సీనియర్ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన భార్య తంజీమ్ ఫాతిమాకు సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చి పంపాలని నిర్ణయించింది. ఆ ఆఫర్ ఆజాంఖాన్ భార్య నిర్ద్వందంగా తోసి పుచ్చింది.


