Maharashtra Bus Accident: రన్నింగ్‌ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం

Massive Bus Fire Accident In Maharashtra Buldhana - Sakshi

ప్రైవేట్‌ బస్సు బోల్తా..ఆపై మంటలు

25 మంది ప్రయాణికులు సజీవ దహనం

సురక్షితంగా బయటపడిన ఆరుగురు

ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

నాగ్‌పూర్‌: డ్రైవర్‌ తప్పిదం 25 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు, విద్యుత్‌ స్తంభాన్ని, ఆపై డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు 25 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, క్లీనర్‌ మరో ఆరుగురు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది.

ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  విదర్భ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుణె నుంచి నాగ్‌పూర్‌కు 33 మందితో బయలుదేరింది. యావత్మాల్‌ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. ఆ తర్వాత సిండ్‌ఖెద్రజాకు సమీపంలోని పింపల్‌ఖుటా గ్రామం వద్ద 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైందని బుల్దానా ఎస్‌పీ సునీల్‌ కడాస్నే చెప్పారు.

బస్సు రోడ్డు కుడి పక్కన ఇనుప స్తంభాన్ని, ఆపై డివైడర్‌ను ఢీకొట్టి కుడివైపునకు అంటే ఎంట్రీ డోర్‌ పైవైపు ఉండేలా పడిపోయింది. డీజిల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు అంతటికీ వ్యాపించాయి. ‘ఈ ఘటనకు డ్రైవర్‌ తప్పిదమే కారణమని భావిస్తున్నాం. నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తోంది. డ్రైవర్‌ చెబుతున్న విధంగా ఘటనకు టైర్‌ పేలడం కారణం కాదు. అందుకు తగిన ఆధారాలేవీ రోడ్డుపై కనిపించలేదు’ అని అమరావతి రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంతెలిపింది. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.  

వాహనదారులు సాయం చేసుంటే..
బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వచి్చన ప్రయాణికులు తమ అనుభవాలను వివరించారు. బస్సు నుంచి బయటపడ్డాక అటుగా వెళ్తున్న వాహనదారులను మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని కోరామన్నారు. ఎవరూ పట్టించుకోలేదని, ఆగకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలనైనా కాపాడి ఉండేవారమని చెప్పారు. మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడలేక నిస్సహాయతతో చూస్తుండి పోవాల్సి వచి్చందని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు గుర్తుపడితే వారికి అప్పగిస్తాం. లేనిపక్షంలో డీఎన్‌ఏ పరీక్షలు జరిపిస్తామని అధికారులు అన్నారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఘటనాస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top