
నాగ్‌పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్‌గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు.
ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.