
ముంబై: దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటిది జరగరాదంటే సంపద వికేంద్రీకృతం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పారు.
నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి గడ్కరీ వివిధ సామాజిక అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారేగాని, సంపద కేంద్రీకరణను ఆపే చర్యలను మాత్రం తీసుకోలేదని గడ్కరీ తెలిపారు. జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 22–24 శాతం, సేవా రంగం 52–54 శాతం వాటా కాగా, గ్రామీణ జనాభాలోని 65–70 శాతం మంది పాల్గొనే వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతం మాత్రమేనని ఆయన వివరించారు.
ఈ అసమతుల్యతను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ఆర్థిక రంగానికి చార్టెర్డ్ అకౌంటెంట్ల అవసరం ఎంతో ఉందని, వారు చోదకశక్తుల వంటివారని అభివర్ణించారు. రోడ్ల నిర్మాణం కోసం బీవోటీ(బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్)విధానాన్ని అమల్లోకి తెచ్చిన వారిలో తానూ ఉన్నానంటూ గడ్కరీ..ఇప్పుడిక రోడ్ల అభివృద్ధికి నిధుల కొరతనేదే లేదని వివరించారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల నుంచి ఏడాదికి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే రెండేళ్లలో ఇది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందన్నారు.