ముంబై: కొత్త వాహనం కొనాలన్న కోరిక ఎంతటి వారితోనైనా, ఎలాంటి తప్పునైనా చేయిస్తుంది అనడానికి మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. యువతలో క్రేజ్ ఉన్న మహీంద్రా థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేసేందుకు ఓ యువకుడు తన స్వయానా బాబాయ్ ఇంట్లోనే కన్నం వేశాడు. తాను కొనుగోలు చేసిన ఆ కొత్త కారు పూజకు ఏకంగా బాబాయ్‌నే ఆహ్వానించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పన్హాలా తహసీల్ పరిధిలోని సతావే గ్రామంలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం.. సతావే గ్రామానికి చెందిన 19 ఏళ్ల సమర్ పోపట్ చవాన్ అనే యువకుడికి ఖరీదైన మహీంద్రా థార్ అంటే మహా ఇష్టం. ఆ కారును ఎప్పుడెప్పుడు కొనుగోలు చేయాలా? అని ఉవ్విళ్లూరాడు. అయితే ఖరీదైన థార్‌ను కొనుగోలు చేసేందుకు షార్ట్‌కట్ ఎందుకున్నాడు. ఇందులో భాగంగా తన ఇంటి సమీపంలో నివసించే బాబాయ్ వరసయ్యే ఉమేష్ మారుతి చవాన్ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నెలరోజుల క్రితం దొంగతనం చేశాడు.
ఉమేష్ ఇంటి బీరువాలో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన మిత్రుడు సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో ఆ బంగారాన్ని విక్రయించాడు. వచ్చిన రూ.10 లక్షలతో కారును కొనుగోలు చేశాడు.
పిలుపే కొంప ముంచింది!
కొత్త కారు ఇంటికి రావడంతో సంబరపడిపోయిన నిందితుడు సమర్.. ఆ వాహనానికి నిర్వహించే పూజా కార్యక్రమానికి తన బాబాయ్ ఉమేష్ కుటుంబాన్ని కూడా ఆహ్వానించాడు. అదుగో అప్పుడు సమర్ చేసిన దొంగతనం బయపడింది. పూజా సమయంలో ధరించేందుకు తన భార్య బంగారు నగలు తీసుకువచ్చేందుకు బాబాయ్ ఉమేష్ బీరువా తెరిచి చూడగా అసలు విషయం బయటపడింది. బీరువాలో ఉండాల్సిన సుమారు 15 తులాల బంగారం మాయం కావడంతో లబోదిబోమన్నాడు.
అయితే అక్కడే ఉన్న ఉమేష్ అమ్మమ్మ నగలు భద్రంగానే ఉండటం, కేవలం ఉమేష్, ఆయన భార్యకు సంబంధించిన ఆభరణాలు మాత్రమే అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులకు దీని వెనుక తెలిసిన వాళ్ల పనేనని గట్టి అనుమానం వచ్చింది. దీంతో బాధితుడు ఉమేష్ కొడోలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడు సమర్ అకస్మాత్తుగా అంత ఖరీదైన థార్ కారును ఎలా కొనుగోలు చేయగలిగాడనే కోణంలో కూపీ లాగారు. పోలీసుల విచారణలో సమర్ దొరికిపోయాడు.తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అసలు నిందితుడు సమర్‌తో పాటు, ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన స్వర్ణకారుడు సంగ్రామ్ మోరేను కూడా అరెస్ట్ చేశారు. బాబాయ్ కారు కొనుగోలుకు ఆశీర్వాదం ఇస్తాడని సంతోషంగా పిలిచిన మేనల్లుడు.. అదే కారు పూజ పుణ్యాన కటకటలా పాల్వడం చర్చాంశనీయంగా మారింది


