మా కొడుకు బతికి ఉన్నాడా? చచ్చడా? | Puthalapattu Branch Manager Manju Incident In Anantapur | Sakshi
Sakshi News home page

మా కొడుకు బతికి ఉన్నాడా? చచ్చడా?

Oct 10 2026 9:40 AM | Updated on Oct 10 2026 10:04 AM

Puthalapattu Branch Manager Manju Incident In Anantapur

నలుగురు కూతుళ్ల చివరన ఒక్కగానొక్క కొడుకు..బాగా చదివిస్తే ప్రయోజకుడై.. అవసానదశలో ఆలనాపాలన చూసుకుంటాడని పేద తల్లిదండ్రులు ఆశించారు. డిగ్రీ వరకు చదివించారు.. తాహతుకు తగ్గట్టు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. అష్టకష్టాలు పడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో కొడుక్కు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారు. కొడుకు కుటుంబ పెద్దగా మారి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న సమయంలో ఉన్నపళంగా అతను అదృశ్యమయ్యాడన్న వార్తతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏ క్లూస్‌ దొరకని కష్టతరమైన కేసులెన్నో ఛేదించిన పోలీసులు.. జంగమ మంజునాథ మిస్సింగ్‌ కేసును మాత్రం నేటికీ కొలిక్కి తీసుకురాలేకపోయారు. అవసాన దశలో తల్లిదండ్రులు ఐదేళ్లుగా కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అసలు వస్తాడో, రాడో తెలియక వేదన చెందుతున్నారు.

అనంతపురం:  కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన జంగమ మేఘనాథస్వామి, నీలమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, కొడుకు జంగమ మంజునాథ్‌ సంతానం. కొడుకును ఉన్నతంగా చదివిస్తే.. భవిష్యత్‌ బాగుంటుందని కలలు కన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మంజు.. ‘స్పందన’ ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. తొలుత కదిరి, గుంతకల్లు, రాయదుర్గం బ్రాంచీల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేసిన అతన్ని కంపెనీ యాజమాన్యం 2021లో చిత్తూరు జిల్లా పూతలపట్టు బ్రాంచ్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేసింది. అక్కడ ఉద్యోగంలో చేరిన తొమ్మిది నెలల్లోనే మంజు అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకూ  జాడలేదు. 



అక్కడ ఏం జరిగిందంటే? 
బ్రాంచ్‌ మేనేజర్‌ మంజుతో పాటు అతని కింద పని చేసే మరో ముగ్గురు ఉద్యోగులు ఖాతాదారులకిచ్చిన లోన్‌ డబ్బులు ఎప్పటికప్పుడు రికవరీ చేయడం..ఆ మొత్తాలను సంస్థ కరెంటు అకౌంట్‌లో జమ చేసేవారు. బ్రాంచ్‌ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి కిందిస్థాయిలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో సఖ్యత లేదని, వారు తరచూ తనతో గొడవ పడుతున్నారని. ప్రశాంతంగా ఉద్యోగం చేయలేకపోతున్నానని మంజు ఫోన్‌లో తల్లిదండ్రులకు చెప్పేవాడు. లోన్‌ డబ్బు రికవరీ..కరెంటు అకౌంట్‌లో జమ చేసే విషయంలో వివాదాలొస్తున్నట్లు చెప్పి మదనపడేవాడు. సరిగ్గా తొమ్మిది నెలల పాటు ఉద్యోగం చేసిన మంజు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. సంబంధిత ఫైనాన్స్‌ సంస్థ గానీ, అక్కడ పని చేసేవారుగానీ అతని ఆచూకీ కోసం ఏమాత్రమూ ప్రయతి్నంచలేదు. పైగా మంజు.. ఫైనాన్స్‌ డబ్బులను అపహరించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్నారు.  


మంజునాథ్‌ తల్లిదండ్రులు నీలమ్మ, మేఘనాథస్వామి, అక్క జ్యోతి  

నిందితుడైతే భౌతికంగా చూపించాలి కదా! 
‘ఫైనాన్స్‌ సంస్థ డబ్బులను మంజు అపహరించి, ఉడాయించి ఉంటే భౌతికంగానైనా పట్టుకొని పోలీసులు అరెస్ట్‌ చేయాలి కదా..!’ అని తల్లిదండ్రులు అంటున్నారు. అసలు తమ కొడుకు ఎక్కడ ఉన్నాడు? అతని అదృశ్యం వెనుక కానివాళ్ల హస్తముందా..? ఇంతకీ అతను ఎలా అదృశ్యమయ్యాడు? అనే మిస్టరీని పోలీసులు ఛేదించాల్సి ఉన్నా.. ఆ దిశగా విచారణ చేయడం లేదని వాపోతున్నారు. వీరిది నిరుపేద కుటుంబం. ఎకరా పొలం మాత్రమే ఉంది. 

కుటుంబ బాధ్యతంతా మేఘనాథ్‌స్వామి చూస్తున్నాడు. బర్ఫీలు తయారు చేసి ఊరూరా తిరిగి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు ఉద్యోగంలో చేరడంతో కష్టాలు, కన్నీళ్లను తుడుస్తాడని ఎన్నో కలలు కన్నారు. మంజు కూడా ఉద్యోగంలో చేరాక  కుటుంబ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోశాడు. అదృశ్యం తర్వాత ఆ కుటుంబ పరిస్థితి తలకిందులైంది. మంజు చిన్న అక్క జ్యోతి కూడా ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెతో పాటు ఇద్దరు కొడుకులూ ఉంటున్నారు. కుటుంబ కష్టాలు మరిన్ని చుట్టుముట్టాయని  వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

మేం చచ్చేలోపైనా ఆచూకీ తెలపండి 
‘మా కొడుకు బతికి ఉన్నాడా? చచ్చడా? బతికి ఉంటే ఎక్కడ ఉన్నాడు? చెప్పండి.. చచ్చుంటే ఎక్కడ చచ్చాడో చెప్పండి... కనీసం ఎముకలైనా ఇవ్వండి..కడసారి అవైనా చూసుకొని సమాధి కట్టుకొని కడుపుకోత తీర్చుకుంటాం’ అంటూ తల్లిదండ్రులు నీలమ్మ, మేఘనాథస్వామి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘మా కొడుకు ఆచూకీ కోసం తిరగని స్టేషన్‌ లేదు.. అడగని పోలీసూ లేడు. పూతల పట్టు పోలీసుస్టేషన్, చిత్తూరు జిల్లా ఎస్పీ ఆఫీసు, రాయదుర్గం, కణేకల్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాం. హైకోర్టులో కేసు కూడా వేశాం. మా కొడుకుపై దొంగతనం నేరం మోపారు. వాడు డబ్బు కాజేసే రకం కాదు! మా బిడ్డను వెతికి తీసుకొస్తే ఎలాగోలా ఎన్ని లక్షలైనా కడతామని పూతలపట్టు పోలీసులను వేడుకున్నాం. అక్కడ వారం రోజుల పాటు ఉన్నాం.. అయినా పోలీసులు కరుణించలేదు. మొదట్లో నాలుగైదు రోజుల పాటు తూతూమంత్రంగా విచారణ చేసి, తర్వాత కేసును గాలికి వదిలేశారు’ అంటూ వారు వాపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement