ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది | Bihar Shocker, Passengers Catch Mobile Phone Snatcher At Train Window, Thief Hangs Outside Moving Train In Viral Video | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది

Oct 14 2026 4:03 PM | Updated on Oct 14 2026 4:30 PM

video passengers catch suspected phone thief at bihar

చెడపకురా చెడేవు అన్న సామెత మనం తరుచుగా వింటూనే ఉంటాం ఎవరికైనా చెడు చేద్దామని తలిస్తే మనకే మెుదలుగా చెడు జరుగుతుందని దీని అర్థం బిహార్‌లో సరిగ్గా ఇటువంటి ఘటనే జరిగింది. ట్రైన్‌లో వెళుతున్న ఓ ప్రయాణికుడి ఫోన్ కాజేద్దామనుకున్న దొంగని.. సదరు వ్యక్తి గట్టిగా పట్టుకున్నారు. అంతలేనే ట్రైన్‌ కదలడంతో దానితో పాటు తీసుకెళ్లాడు.. కొంత దూరం తీసుకెళ్లి విడువగా బొక్కా బోర్లా పడ్డాడు.. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఉన్న శివనారాయణ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ బయలుదేరుతున్న సమయంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను తెరిచి ఉన్న కిటికీ గుండా లాక్కునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే, కోచ్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని పట్టుకున్నారు. అతడు అక్కడి నుంచి తప్పించుకోకుండా అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో రైలు కదలడంతో ఆ వ్యక్తి రైలు బయట వేలాడే పరిస్థితి ఏర్పడింది.

రైలు ముందుకు కదులుతున్న కొద్దీ ఆ వ్యక్తి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్నవారు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ప్రయాణికులు అతడిని పట్టుకుని ఉండటంతో కొంతదూరం పాటు రైలు బయటకు వేలాడుతూ వెళ్లాడు అనంతరం  వాళ్లు వదిలేయడంతో అతడు ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు దొంగకు ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

అయితే, అనుమానిత దొంగను పట్టుకునే క్రమంలో ప్రయాణికులు అనుసరించిన విధానంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కదులుతున్న రైలు బయట ఒక వ్యక్తిని పట్టుకుని వేలాడదీయడం వల్ల అతడితో పాటు అతడిని పట్టుకున్న ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. రైలు వేగం పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చు. పట్టుతప్పి పడిపోతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశాలున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని శిక్షించడం సరైందే కానీ దానికి ఓ పద్దతి ఉండాలి అని అంటున్నారు.  రైలులో లేదా రైల్వే స్టేషన్‌లో దొంగతనానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కనిపిస్తే ప్రయాణికులు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా వారిని ఎదుర్కోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను వెంటనే రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇదీ చదవండి: ఈడ్చుకెళ్లారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement