టీవీకే విఫలమైతే.. ప్రత్యామ్నాయ సీఎం రేసుపై ఎడప్పాడి వర్గం కసరత్తు! | We Planned to Make Thirumavalavan CM if Vijay Fell Short of Majority: TTV Dhinakaran | Sakshi
Sakshi News home page

టీవీకే విఫలమైతే.. ప్రత్యామ్నాయ సీఎం రేసుపై ఎడప్పాడి వర్గం కసరత్తు!

Oct 25 2026 3:37 PM | Updated on Oct 25 2026 4:18 PM

We Planned to Make Thirumavalavan CM if Vijay Fell Short of Majority: TTV Dhinakaran

సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న అతిపెద్ద పార్టీగా విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అవతరించింది. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి మెజారిటీ దక్కకపోవడంతో, ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేకపోతే... 'విదుతలై చిరుతైగళ్ కట్చి' (వీసీకే) అధినేత తోల్ తిరుమావళవన్‌ను ముఖ్యమంత్రిని చేసే అవకాశాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామి (ఈపీఎస్)తో పాటు ఇతర నాయకులు పరిశీలించారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వెల్లడించారు.

ఆదివారం విలేకరులతో మాట్లాడిన దినకరన్.. తమిళనాడులో జరిగిన ప్రభుత్వ ఏర్పాటు పరిణామాలపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. టీవీకే సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాం. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు.  టీవీకే ఎమ్మెల్యేలను ఇతర పార్టీలు తమ వైపు లాగేసుకోకుండా నిరోధించేలా చర్యలు తీసుకున్నాం. వామపక్ష పార్టీలు, తిరుమావళవన్ మద్దతు ఇవ్వకపోతే, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమయ్యేదు. 

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్... తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయదని స్పష్టం చేయడంతో, అన్నాడీఎంకే నాయకత్వంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం చర్చలు జరిగాయి. అయితే, పళనిస్వామికి మద్దతు ఇవ్వడం అంటే బీజేపీకి మద్దతు ఇవ్వడమేనని భావించిన వామపక్ష పార్టీలు, ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించారు.   

ఆ తర్వాతే ఈపీఎస్‌తో సహా మేమంతా కలిసి తిరుమావళవన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నించాం. ఒకవేళ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేకపోతే, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నేను విజయ్‌ను కోరా’ అని వెల్లడించారు. 

తమిళనాడులో దాదాపు వారం రోజుల పాటు సాగిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తాజా టీటీవీ దినకరన్‌ వ్యాఖ్యలతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. నాటి ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) తమ మద్దతును ప్రకటించడంతో కూటమి బలం 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను నాలుగు సార్లు కలిసిన అనంతరం విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం లభించింది. దీంతో మే 10న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చదవండి:  హాట్‌ టాపిక్‌ : ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై టీవీకే స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement