నియంతృత్వ శక్తులపైనే మా పోరాటం: మల్లికార్జున్‌ ఖర్గే

Mallikarjun Kharge Says We Will Work Together To Fight Fascist Forces - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికయ్యారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో గాంధీయేతర తొలి అధ్యక్షుడిగా నిలిచారు. పార్టీ ప్రెసిడెంట్‌గా తొలిసారి మీడియా ముందుకు వచ్చిన  ఖర్గే.. పార్టీలో అంతర్గతంగా నిర్వహించే ఎన్నికలు పార్టీని బలోపేతం చేస్తాయన్నారు. కార్యకర్తల అంచనాలకు తగ్గట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. 

‘ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. శశి థరూర్‌కు నా కృతజ్ఞతలు, అలాగే నా శుభాకాంక్షలు. నాపై పోటీ చేశారు. నన్ను కలిసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. శశి థరూర్‌తో కలిసి పని చేస్తాం. రాహుల్‌ గాంధీ నాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. సోనియా గాంధీకి నా కృతజ్ఞతలు. ఆమె జీవితం మొత్తం పార్టీకోసమే వెచ్చించారు. ఆమె నాయకత్వంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.’అని పేర్కొన్నారు ఖర్గే. 

మరోవైపు.. బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. మతాల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామన్నారు. ‘పార్టీలో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఏమీ ఉండదు. అందరం కలిసి పని చేస్తాం. మేమంతా కలిసి కట్టుగా మతతత్వ వేషధారణలో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతాం.’అని పేర్కొన్నారు మల్లికార్జున్‌ ఖర్గే. మరోవైపు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన ఖర్గే.. అక్టోబర్‌ 26న బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ ఎంపీ రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. 

ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌.. మల్లికార్జున ఖర్గే ఘన విజయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top