స్త్రీ శక్తి
‘సమస్యలు వస్తాయని నాలుగు గోడలు కట్టి అమ్మాయిలను అందులో ఉంచడం రక్షణ అనిపించుకోదు. చెడును ఎలా ఎదుర్కోవాలో వారికి అవగాహన కల్పించాలి.
రాప్తాడు వంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడకూడదు. మనం కూడా దాని గురించి నెగిటివ్‌గా ప్రచారం చేయకుండా పాజిటివ్‌గా ఖండించాలి...’’ అని తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి తెలిపారు.
మహిళల భద్రత కోసం అర్ధరాత్రి సమయంలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి ప్రశంసలు అందుకున్న ఈ అధికారిణì స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోనూ, మహిళా రక్షణ సెల్ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌గా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నేరస్తుల అణచివేతపై నిర్విరామ కృషి చేస్తున్నారు. ఈ పండగ వేళ మహిళా భద్రత గురించి ‘సాక్షి’తో పంచుకున్న విషయాలివి...
‘‘రాబోయే సమస్యల గురించి, ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. అంతేకాని, బయట సమాజం బాగోలేదని నాలుగు గోడల మధ్యనే ఉంచుదాం, తోడుగా ఎవరినో ఇచ్చి పంపుదాం.. అని కాదు ఆలోచించాల్సింది. చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి, తమ చుట్టూ ఏం జరుగుతుందో, ఎంత అలెర్ట్‌గా ఉండాలో అమ్మాయిలు తెలుసుకునేలా చేయాలి. మేం ప్రభుత్వ స్కూళ్లలో ‘ధీర’ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. అమ్మాయిలకు ఆత్మరక్షణ నేర్పించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
గతంతో పోల్చితే నేడు ప్రతిచోటా అమ్మాయిలు చదువు, వృత్తి, ఉద్యోగాలు అంటూ బయటకు వస్తున్నారు. వివిధ రకాల పనులు చేస్తూ దేనిలోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. రాప్తాడు లాంటి సంఘటనలు జరగడానికి కారణం తల్లిదండ్రుల పెంపక లోపమే. పిల్లలను స్కూల్‌కి పంపిస్తారు. అక్కడ ర్యాంకులు, మార్కుల గురించి అడుగుతారే తప్ప.. మా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది? వారి ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి... అని టీచర్లను అడగడం లేదు. సమాజం పట్ల జాగ్రత్తల గురించి అమ్మాయికి ఎంత చెబుతామో అబ్బాయిలకూ అంతే చెబితే బాల్యంలోనే పిల్లలను సరిదిద్దగలిగే అవకాశం ఉంది.
→ దేనిలోనూ స్త్రీ తీసిపోదు
సమస్య వచ్చినప్పుడు మహిళ తనకు తానుగా ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలి. ఈ సంఖ్య ఈ రోజుల్లోనూ తక్కువే. ‘భర్త చెబితేనే, మా అబ్బాయి వస్తేనే... ’ అన్నట్టుగా ఉన్నారు.‘సమస్య గురించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలనే’విషయం మహిళలకు ఎవరు చెప్పాలి? ఇది పురుషాధిక్యసమాజం అని మనకు మనమే పరిమితుల్లో ఆలోచిస్తున్నాం. అమ్మాయిలు కూడా నేను ఏ రంగంలో ఉన్నా పురుషుడికంటే భిన్నం కాదని అనుకోవాలి.
→ బాధ్యత ఎవరిదంటే..
‘సమాజంలో పోలీస్ రోల్ ఏంటి, నేను ఎంతవరకు బాధ్యతగా ఉన్నాను..’ అనే అవగాహన ప్రజలకు ఉండాలి. ఏ అమ్మాయి అయినా తమ పనుల్లో భాగంగా ఏ సమయంలోనైనా ధైర్యంగా వెళ్లచ్చు. ఇప్పుడు ఫోన్లు, హెల్ప్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. లేనిది, అలెర్ట్‌గా ఉండటం, ధైర్యం లేకపోవడమే.
→ ఒంటరిగానే ఎదుర్కోవాలి..
ఈ రోజుల్లో ఒంటరిగా ఉండేవారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. పెళ్ళిళ్లు అయినా తమకు నచ్చని జీవనంలో ఉండటం లేదు. ఒంటరిగా బతకగలం అనే ధైర్యం అమ్మాయిల్లో బలంగా వస్తోంది. పల్లె నుంచి పట్నానికి, పట్నం నుంచి విదేశాలకు ఒంటరిగా వెళ్లి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు తమ గురించి తాము అప్రమత్తంగా ఉండాలి. రాప్తాడు లాంటి సంఘటనలు ఎక్కడో జరిగినప్పుడు నిష్పక్షపాత ధోరణిలో వాటిని విశ్లేషించాలి. అప్పుడు సమాజంలోనూ అర్థం చేసుకునే విధానం పెరుగుతుంది. లేదంటే, భయం అనే నీడలోనే బతకాల్సి వస్తుంది. అవసరమైతే పోలీసుల సాయం తీసుకునేందుకు వెనకడుగు వేయకూడదు.
→ స్మార్ట్‌గా తిప్పి కొట్టాలి..
సమాజంలో చెడు ఒకలా ఉంటే, డిజిటల్లో మోసాలు మరోలా ఉన్నాయి. బయట ఎంత చెడు జరుగుతుందో ఆన్‌లైన్‌లోనూ అంతకన్నా ఎక్కువ చెడు ఉంది. ప్రస్తుతం నీటి కరువు ఉంది. దీంతో జలమండలి నుంచి వాటర్ బిల్స్ అంటూ ఫోన్లకు లింక్స్ వస్తున్నాయి. అవి నిజమని నమ్మి, ఆ లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో డబ్బు దేశాలు దాటుతోంది. ఇక అమ్మాయిలపై ఆన్లైన్లో ఎంత మానసిక హింస జరుగుతుందో చెప్పలేం. మారుతున్న టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవాలి. అందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విధానం మారాలంటే ముందు మనందరి ఆలోచనల్లో మార్పు రావాలి.
→ నక్సలిజంలోనూ వివక్ష
దాదాపు రెండేళ్ల కాలం ఇంటలిజెన్స్ విభాగం, ప్రభుత్వ సపోర్ట్ కలిసి చేసిన నక్సల్స్ సరెండర్ అనే ప్రక్రియ విజయవంతమైంది. వారిలో చూస్తే అక్కడా మహిళల వివక్ష దారుణంగా ఉంది. లీడర్ స్థాయిలో ఉన్నవారు ఎంత చెబితే అంత. భద్రత చూస్తే జీరో స్థాయి. ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిన అమ్మాయిలు చానాళ్లు సమాజానికి దూరంగానే ఉన్నారు. వారిలో ఇప్పుడు చదువుకుంటున్నవారు, వివిధ రకాల పనులు చేసుకుంటూ గౌరవంగా జీవనం సాగిస్తున్న వారున్నారు. సమాజంలో బాధ్యతతో నడుచుకుంటూ ఆనందంగా జీవించమన్న సందేశం ఇచ్చే మన పండగల సంస్కృతి ఎంతో గొప్పది. వాటి వెనక దాగి ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటూ చెడుపై విజయాన్ని సాధించడంలో మహిళ ఎప్పుడూ ముందుండాలి’ అంటున్నారు. ఈ పోలీసు అధికారిణి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్


