భూముల అంశంపై మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చ.. హెచ్‌ఎండీఏకు కేటాయించాలని ప్రాథమిక నిర్ణయం
నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపొందించాలి
అధికారులను ఆదేశించిన ఉప సంఘం
నివేదిక ఆధారంగానే ముందుకు.. టీజీఐఐసీకి కూడా అప్పగించే యోజన
అమ్మకం ద్వారా రూ.25 వేల కోట్లు వస్తాయని అంచనా
డిసెంబర్‌లో తుది నిర్ణయం..ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సంక్రమించిన మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలి? ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు వేగిరమైంది. ఈ భూములను ఏ పద్ధతిలో? ఎవరి ద్వారా అమ్మాలి? ఈ భూముల వేలం ప్రక్రియలో ఏ ప్రభుత్వ సంస్థ ద్వారా ముందుకెళ్లాలన్న దానిపై కీలక చర్చ జరిగింది.
ఆదాయ వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గం ఉపసంఘం భేటీలో జరిగిన ఈ చర్చలో మియాపూర్ భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు అప్పగించాలన్న ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భూములను ఏం చేయాలన్న దానిపై నెలరోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఈ నివేదిక అనంతరం మరోమారు ఉపసంఘం భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని హెచ్‌ఎండీఏ అధికారులను ఉపసంఘం ఆదేశించినట్టు సమాచారం.
అయితే, మియాపూర్ చుట్టూ పారిశ్రామిక పార్కులు ఇప్పటికే వ్యవస్థీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పుడు దఖలు పడిన భూములను కూడా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా అమ్మించాలనే అంశంపై కూడా ఉపసంఘం చర్చించినట్లు తెలిసింది.
గుట్టలెన్ని.. పుట్టలెన్ని?
మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 100, 101లో ఉన్న 550 ఎకరాల భూముల అంశంపై మంత్రివర్గ ఉపసంఘంలో చాలాసేపు చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, భవిష్యత్ అవసరాలకు వీటిని ఎలా వినియోగించుకునే అవకాశముందన్న దానిపై హెచ్‌ఎండీఏ అధికారులు వివరించారు. 2012లోనే ఈ భూములను హెచ్‌ఎండీఏకు కేటాయించారని, ఈ భూముల్లో ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్ హబ్‌ల ఏర్పాటుకు మెరుగైన అవకాశాలున్నాయని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు.
హెచ్‌ఎండీఏ అధికారుల వివరణ అనంతరం ఉపసంఘం సభ్యులు మాట్లాడుతూ అసలు ఈ భూముల్లో ఎంత విస్తీర్ణం ఇప్పటికప్పుడు అమ్మకానికి అనువుగా ఉంది? గుట్టలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి? ప్రస్తుతం మార్కెట్‌లో ఈ భూమి విలువ ఎంత ఉందన్న దానిపై ఆరా తీయగా, ఎకరం ఇక్కడ రూ.50 కోట్ల వరకు అమ్ముడవుతుందని, 550 ఎకరాల అమ్మకం ద్వారా కనీసం రూ. 25 వేల కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు సమకూరుతాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి అన్ని అంశాలపై డిసెంబర్‌లో మొదటి వారం కల్లా నివేదిక తయారు చేయాలని, ఈ నివేదికను బట్టి హెచ్‌ఎండీఏ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఉపసంఘం స్పష్టం చేసింది.
ఐఐసీ ద్వారా వెళ్దామా?
ఈ చర్చలో భాగంగానే హెచ్‌ఎండీఏ కాకుండా టీజీఐఐసీ ద్వారా మియాపూర్ భూములను వేలం పెట్టే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ భూముల చుట్టూనే బొల్లారం, పటాన్‌చెరు, బాచుపల్లి పారిశ్రామిక ప్రాంతాలతో పాటు హఫీజ్‌పేట మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ విస్తరించి ఉన్నాయని, ఇక్కడ కూడా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది.
హెచ్‌ఎండీఏ కంటే టీజీఐఐసీ వేలం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా టీజీఐఐసీ పేరిట భూములను అమ్మితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం వచ్చింది. హైటెక్‌సిటీ, మైండ్‌స్పేస్ ఐటీ పార్కు, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్ల ద్వారా రోడ్డు మార్గంలో ఈ భూములను చేరుకునే అవకాశమున్నందున అన్ని కోణాల్లో ఆలోచించి ఇక్కడ భూములను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చనే పలు ప్రతిపాదనలు కూడా ఉపసంఘం చర్చలో వచ్చినట్లు సమాచారం.
ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ బిజినెస్ హబ్, ఫార్మా పరిశోధన కేంద్రాలు, కన్వెన్షన్ ట్రేడ్ సెంటర్లు, విద్య, వైద్య పరిశోధన కేంద్రాలు, లాజిస్టిక్స్ లాంటి రంగాల అభివృద్ధికి గల అవకాశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. కాగా, మరో నెలరోజుల్లో హెచ్‌ఎండీఏ నివేదిక వచ్చిన అనంతరం ఈ భూముల అమ్మకానికి సంబంధించిన కసరత్తు మరింత వేగిరమవుతుందని ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం డిసెంబర్‌లో తీసుకుంటారనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది.


