కుమారుడిపై కుంభకోణం కేసు.. అజిత్ పవార్‌ రియాక్షన్‌ | Maharashtra Ajit Pawar Respond On Land Deal Row | Sakshi
Sakshi News home page

కుమారుడిపై కుంభకోణం కేసు.. అజిత్ పవార్‌ రియాక్షన్‌

Nov 8 2025 8:44 AM | Updated on Nov 8 2025 9:34 AM

Maharashtra Ajit Pawar Respond On Land Deal Row

ముంబై: ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కుమారుడి సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సంబంధిత తహశీల్దార్‌పై సస్పెండ్‌ వేటు వేసిన ప్రభుత్వం, తాజాగా రూ.300 కోట్ల విలువైన ఆ భూ విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని అజిత్‌ పవార్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు.

అంతకుముందు, ఆయన సీఎం ఫడ్నవీస్‌తో అజిత్‌ పవార్‌ సమావేశమయ్యారు. ‘పుణె నగరంలోని మౌజె ముంధ్వా ప్రాంతంలో ఉన్న ఆ 40 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తి. దానిని విక్రయించరాదు. ఈ విషయం తన కుమారుడు పార్థ పవార్‌కు, అతడి వ్యాపార భాగస్వామి దిగ్విజయ్‌ పాటిల్‌కు తెలియదు. భూ విక్రయం, రిజిస్ట్రేషన్‌ వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులోనే తేలుతుంది. ఆ భూమిని పార్థకు చెందిన సంస్థకు విక్రయించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు’అని అజిత్‌ పవార్‌ వివరించారు. భూ రిజిస్ట్షేషన్‌ కోసం రిజిస్టార్‌ ఆఫీసుకు వెళ్లిన ముగ్గురిలో తన కుమారుడు లేడన్నారు.

కేవలం భూ ఒప్పందం మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన.. భూ బదిలీ, చెల్లింపులు చేయలేదని చెప్పారు. ఈ సేల్‌డీల్‌ను రద్దు చేయాలంటూ సంబంధిత అధికారులకు తిరిగి పత్రాలను పంపించారని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేసిన ఈ మొత్తం వ్యవహారంపై అదనపు ప్రధాన కార్యదర్శి వికాస్‌ ఖర్గే సారథ్యంలోని బృందం దర్యాప్తు చేపట్టనుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ఈ బృందం అంచనా వేసి నెలరోజుల్లో నివేదిక అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ భూమి మార్కెట్‌ విలువ రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దళితులకు కేటాయించిన ఆ భూమిని ప్రభుత్వం కొట్టేసిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారం డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కనుసన్నల్లోనే జరిగిందని ఉద్యమ కారుడు అన్నా హజారే తప్పుబట్టారు.  

మరోవైపు.. పూణే భూ ఒప్పందంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. కానీ డబ్బు మార్పిడి ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే, రిజిస్ట్రేషన్‌ ఇప్పటికే పూర్తయింది. రెండు పార్టీలు ఇప్పుడు రిజిస్ట్రీని రద్దు చేయాలని దరఖాస్తు దాఖలు చేశాయి. అయితే, రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడానికి వారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారికి నోటీసు జారీ చేయబడింది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులపై చర్చలు కచ్చితంగా ఉంటాయి. మొత్తం విచారణ ఒక నెలలోపు పూర్తవుతుంది. దీనిలో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement