
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఇటీవలి రోజులలో అది మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిపోతోంది. చివరికి పెళ్లిపీటల మీదే తెగతెంపులవుతున్న వ్యవహారాలూ కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల ప్రముఖ ఫెయిర్‌మాంట్ హోటల్‌లో గతంలో ‘వార్తల్లో’ నిలిచిన సౌరభ్ అహుజా వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. వేడుకలోని ఒక్కక్క కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతూ వస్తోంది. ఇక కొద్ది క్షణాల్లో నూతన వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం జరగనుంది. ఇంతలో హఠాత్తుగా వరుడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. సౌరభ్ అహుజా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వాంటెడ్ నిందితుడు. ఇతను ఫెయిర్‌మాంట్ హోటల్‌లో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరరేట్(ఈడీ) అధికారులు మండపానికి చేరుకున్నారు.
ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిందితుడు సౌరభ్ అహుజా ఏడడుగుల తంతుకు ముందు పరారయ్యాడు. దీంతో ఈడీ అధికారులు నూతన వధువుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో అహుజా వాంటెడ్ నిందితుడు. అతన్ని అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. మహాదేవ్ యాప్ ప్రాథమిక ఆపరేటర్లలో అహుజా ఒకడు. అతిథులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు పెళ్లి దుస్తుల్లోనే పరారయ్యాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సౌరభ్ కొంతకాలంగా ఈడీ అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. కల్యాణ మండపం నుంచి అతను పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ