‘మహాదేవ్‌’ లూటీ రోజుకు రూ.200 కోట్లు | Sakshi
Sakshi News home page

‘మహాదేవ్‌’ లూటీ రోజుకు రూ.200 కోట్లు

Published Sat, Oct 7 2023 5:23 AM

Mahadev Betting App Scam Case: Bollywood Stars Are Under Scanner - Sakshi

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్‌ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్‌ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్‌ నటులు రణబీర్‌ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి  నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్‌ బాగోతం బయటపడింది.
 
► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్‌ చంద్రశేఖర్, రవి ఉప్పల్‌ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు.  
► కొత్తకొత్త వెబ్‌సైట్లు, చాటింగ్‌ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తారు.  
► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్‌ ద్వారానే సంప్రదిస్తుంటారు.  
► కస్టమర్లను బెట్టింగ్‌ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్‌ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది.  
► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్‌లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్‌ యాప్‌లో రిగ్గింగ్‌ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది.  
► మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది.  
► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్‌ యాప్‌నకు వందలాది కాల్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు.  
► భారత్‌లోని 30 కాల్‌ సెంటర్లను అనిల్‌ దమానీ, సునీల్‌ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది.  
► బెట్టింగ్‌ యాప్‌ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది.
► బెట్టింగ్‌ సిండికేట్‌ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ ప్రమోట్‌ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది.  
► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్‌ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్‌ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్‌ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలను చార్టర్డ్‌ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు.

 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

 
Advertisement
 
Advertisement