
ప్రయాగ్‌రాజ్: కుంభమేళాలో స్నానం చేస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు కుంభమేళా ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మధురలోని బృందావనాన్ని సందర్శించి, అక్కడినుంచి కుంభమేళాకు వచ్చిన ఒక వ్యక్తికి చేదు అనుభం ఎదురయ్యింది. జనసమూహంలో అతని పర్సు చోరీకి గురయ్యింది. ఆ పర్సులో నగదు, విలువైన కాగితాలు ఉన్నాయి. దీంతో అతను కాసేపు బాధపడ్డాడు. తిరిగి తన స్వస్థలానికి చేరడం ఎలా అని ఆలోచించాడు. వెనువెంటనే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు.
జేబులో ఒక్కపైసా కూడా లేకపోవడంతో మరోమార్గం లేక అక్కడున్న కొందరు భక్తులకు తన పరిస్థితి చెప్పుకుని, డబ్బులు సాయం చేయాలని కోరాడు. వారిచ్చిన డబ్బుతో టీ తయారు చేసి విక్రయించసాగాడు. ఇలా కుంభమేళాలో రోజుకు రెండు, మూడు వేలు సంపాదిస్తూ రూ. 50 వేలు జమచేశాడు.
పర్సుపోతే పోయిందిగానీ, అతనికి ఒక కొత్త ఉపాధి మార్గం దొరికింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను బృందావనం నుంచి మహాకుంభమేళాలో స్నానం చేసేందుకు వచ్చాను. ఇంతలో నా పర్సు ఎవరో చోరీ చేశారు. ఏం చేయాలో తెలియక టీ విక్రయిస్తూ, డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. రాత్రనక, పగలనక ఇక్కడికి వచ్చే భక్తులకు టీ అమ్ముతూ వచ్చాను. రోజుకు మూడు వేల రూపాయల వరకూ సంపాదించాను. అలా ఇప్పటివరకూ రూ. 50 వేలు కూడబెట్టాను’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి..