
ఢిల్లీ: భారత్ జోడోయాత్రలో నమోదైన కేసులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడోయాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో ఆయనక లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలోభాగంగా రూ. 20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ న్యాయవాదులు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది కోర్టు.
2022, డిసెంబర్ 16వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా భారత్ ఆర్మీ సైనికుల్ని రాహుల్ కించ పరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫను వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్‌వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్‌పై కేసు నమోదైంది. భారత్ ఆర్మీని కించపరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు దాఖలు చేశాయి.
మరొకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఈ జనవరిలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.