Know Reasons Behind Deadly Gujarat Morbi Bridge Collapsed - Sakshi
Sakshi News home page

గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి విషాదం.. వంతెన కూలడానికి కారణాలివేనా?

Published Mon, Oct 31 2022 12:59 PM

Know Reasons behind Deadly Morbi Bridge Collapse in Gujarat - Sakshi

గుజరాత్‌లో  మచ్చు నదిపై నిర్మించిన మోర్బీ తీగల వంతెన కూలిపోయిన ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంజనీరింగ్‌ అద్భుతంగా చెప్పుకునే గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలడంతో దాని మీదున్న వందలాది మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మందిని రక్షించారు. మరో వందమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం మూసేసిన ఈ కేబుల్‌ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్‌ సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై సెక్షన్‌లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు  తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేశారు.
చదవండి: Morbi Bridge Collapse: కేబుల్‌ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి

ప్రస్తుతం బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న అందరి బుర్రల్లో మెదులుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటం, పాతకాలపు వంతెన, నిర్వహణ లోపం వంటి పలు కారణాలు తెర మీదకు వస్తున్నాయి.
చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం

మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రద్దీ ఎక్కువగా కనిపించింది. దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్థానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిలో ఛట్‌ పూజా వేడుకల కోసం, సెలవు దినం కావడంతో కుటుంబంతో వచ్చినవారు అధికంగా ఉన్నారు. ఒకేసారి వంతెనపై పరిమితికి మించి ఎక్కువ మంది నడవటం, జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. 

►  ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో బ్రిడ్జిపై నడుస్తున్న కొందరు యువకులు ఉద్ధేశ పూర్వకంగా వంతెనను విపరీతంగా ఊపుతుండటం, ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తుంది. యువకుల పిచ్చి చేష్టల వల్లే బ్రిడ్జి కూలిందని నెటిజనన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పాతదా.. ప్రమాదానికి ముందు తీసిందా అనేది తెలియాల్సి ఉంది.

► మోర్బీ వంతెన 140 ఏళ్ల నాటిది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడం, బలమైన పునాది లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మరమత్తుల కోసం వంతెనను మూసేశారు. ఏడు నెలలపాటు మరమత్తులు నిర్వహించి గుజరాత్‌ న్యూయర్‌ డే వేడుకల కోసం అక్టోబర్‌ 26నే తిరిగి సందర్శకుల నిమిత్తం తెరిచారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఛట్‌ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వందలాది మంది ఒకేసారి వంతెనపైకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు.

మరమత్తుల అనంతరం వంతెనను తెరవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. అంతేగాక వంతెన పటిష్టతను తనిఖీ చేయలేదని, బ్రిడ్జికి మున్సిపల్‌ అధికారుల నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే రీఓపెన్‌ చేశారని విమర్శలు గుప్పుముంటున్నాయి. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement