Gujarat Bridge Collapse: కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జి.. 131 మంది సందర్శకుల మృతి

Cable Bridge Collapses In Gujarat, Several Feared Injured  - Sakshi

మోర్బీ/న్యూఢిల్లీ: మాటలకందని మహా విషాదం. సెలవు రోజున నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారిన వైనం. గుజరాత్‌ రాష్ట్రం మోర్బీ జిల్లాలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణి మందిర్‌ సమీపంలో మచ్చూ నదిపై ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ అయిన 140 ఏళ్ల నాటి  వేలాడే తీగల వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలిపోయింది. దాంతో వంతెన రెండుగా విడిపోయింది. ఆ సమయంలో వంతెనపై మహిళలు, చిన్నారులతో సహా 400 మందికి పైగా ఉన్నట్టు సమాచారం.

వారిలో చాలామంది 100 మీటర్ల ఎత్తు నుంచి హాహాకారాలు చేస్తూ నదిలోకి పడిపోయారు. ఆ విసురుకు 100 మందికి పైగా గల్లంతయ్యారు. 132 మందికి పైగా నీట మునిగి దుర్మరణం పాలైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వెల్లడించారు. ప్రమాదంలో చాలా­మంది గాయపడ్డారు. వారిలో పలువురు నదిలోకి కుంగిపోయిన వంతెనపై వేలాడుతూ కాపాడండంటూ ఆక్రందనలు చేశారు. పైకెక్కేందుకు విశ్వప్రయత్నం చేశారు.


ఆదివారం గుజరాత్‌లో మచ్చూ నదిపై ఉన్న కేబుల్‌ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో పర్యాటకులు. 

ప్రమాదం గురించి తెలిసి సహాయక చర్యలు మొదలవడానికి కనీసం గంట సమయం పట్టింది. అప్పటికే అత్యధికులు నిస్సహాయంగా అసువులు బాశారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పసివాళ్లేనని తెలుస్తోంది. సాయమందేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డవాళ్లు, స్థానికులు వీలైనంత మందిని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ సిబ్బంది వారికి జత కలిశారు. బాధితులను పడవల్లో ఒడ్డుకు చేర్చారు. 


తెగిన బ్రిడ్జిపై చిక్కుబడ్డ బాధితులు

జాతీయ విపత్తు సహాయక బృందాలూ రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి దాటాక కూడా వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సామర్థ్యానికి మించిన భారమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు చాలామంది వంతెనపై గంతులు వేస్తూ, దాని వైర్లను లాగుతూ కన్పించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
వంతెన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్‌ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు తదిరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్‌లోనే ఉన్న మోదీ దీనిపై సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వచ్చారు. బాధితులకు అవసరమైన అన్నిరకాల సాయమూ అందించాలని ఆదేశించారు.

సీఎం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్‌ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్రాలు చెరో రూ.50 వేలు ఇవ్వనున్నాయి. మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్‌ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top