కేజ్రీవాల్‌, ఆయన ఫ్యామిలీకి ఎస్‌ఐఆర్ నోటీసులు.. ఇదెలా సాధ్యం? | Kejriwal and family get SIR notice in Delhi AAP hits out at EC | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌, ఆయన ఫ్యామిలీకి ఎస్‌ఐఆర్ నోటీసులు.. ఇదెలా సాధ్యం?

Sep 19 2026 9:26 PM | Updated on Sep 19 2026 9:30 PM

  Kejriwal and family get SIR notice in Delhi AAP hits out at EC

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబంలోని నలుగురికి ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవి పేర్లు నోటీసుల్లో ఉన్నాయి.

కేజ్రీవాల్ న్యూఢిల్లీ-40 అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటరు. ఢిల్లీ ఎన్నికల సంఘం పత్రాల ప్రకారం, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ‘పార్ట్-51, కేజీ మార్గ్’ పరిధిలో మొత్తం 110 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో కేజ్రీవాల్, ఆయన కుటుంబంలోని మరో ఐదుగురు ఉన్నట్లు ఎన్నికల సంఘం వివరించింది.

ఈ పరిణామంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. “ఈ దేశంలో జరుగుతున్న ప్రతిదీ సుప్రీం లార్డ్‌ను సంతోషపెట్టేందుకేనా? మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ జీ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఢిల్లీ ఓటరు జాబితాలో లేకపోవడం ఎలా సాధ్యం?” అని పార్టీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసు జారీ అయింది. ఆమె వివరాలు, పత్రాలను పరిశీలించిన తర్వాత ఓటరు నమోదు చెల్లుబాటు అయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది. శాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటరు జాబితాలో ఆమె పేరు నవంబర్ 4న చేర్చనున్నారు.

ఆగస్టు 31న విడుదలైన ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఢిల్లీలో దాదాపు 47.6 లక్షల పేర్లు తొలగించారు. గృహస్థాయి ధ్రువీకరణలో వీటిని గైర్హాజరు, వేరే ప్రాంతానికి మారినవారు, మరణించినవారు, నకిలీ నమోదులు, ఇతర కారణాలుగా వర్గీకరించారు. సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చు. సెప్టెంబర్ 16 నాటికి ఓటరు జాబితాలో పేర్ల చేర్పు కోసం 68,043 ఫారం-6 దరఖాస్తులు వచ్చాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తుది ఓటరు జాబితాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అంతకుముందు దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 29 నాటికి పరిష్కరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement