
కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్ హీరోస్ పేరిట ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు.
అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు..
.. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది..
ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.
Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025
ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...
ఆర్మీ డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్ నటుడు తన లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే..
ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్ ఓటీటీలో ఈ ఫుల్ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.