
కర్ణాటక హైకోర్టు అనుమతి
బెంగళూరు: కర్ణాటకలోని ఒక గుహలో నివసిస్తూ పట్టుబడిన రష్యా మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెలు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. పిల్లల తండ్రిగా చెప్పుకొంటున్న ఇజ్రాయెల్ జాతీయుడు ద్రోర్ శ్లోమో గోల్డ్‌స్టెయిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.ఎం.శ్యామ్ ప్రసాద్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మైనర్ పిల్లలను వెంటనే దేశం నుంచి పంపించేయవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గోల్డ్‌స్టెయిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీనా కుటీనాగా అనే రష్యన్ మహిళ, ఆమె పిల్లలు జూలై 11న కుమ్టా తాలూకాలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండల్లోని గుహలో కనిపించారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి దాదాపు రెండు నెలల పాటు తగిన నివాస పత్రాలు లేకుండా అక్కడ నివసించినట్లు అధికారులు తెలిపారు.
భారతదేశంలో తన పిల్లలు ఎక్కడున్నారో గుర్తించలేకపోయానంటూ వారి తండ్రి గోల్డ్‌స్టెయిన్ గత డిసెంబర్‌లో గోవాలోని పనాజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో, కుటీనా, ఆమె కుమార్తెలకు రష్యా కాన్సులేట్ అక్టోబర్ 9 వరకు మాత్రమే చెల్లుబాటయ్యే అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసినట్లు కోర్టు నమోదు చేసింది. అలాగే, వీలైనంత త్వరగా రష్యాకు తిరిగి వెళ్లడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ కుటీనా స్వయంగా కాన్సులేట్‌కు చేసిన విన్నపాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
కస్టడీకి సంబంధించిన ప్రక్రియలు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, పిల్లల శ్రేయస్సుకు విఘాతం కలిగించేలా వారిని దేశం నుంచి పంపించడం సరికాదని గోల్డ్‌స్టెయిన్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, భార్య, పిల్లలు గుహలో ఏకాంతంగా ఎందుకు నివసించవలసి వచ్చిందనే దానిపై గోల్డ్‌స్టెయిన్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల సంక్షేమం, రష్యాకు తిరిగి వెళ్లాలనే తల్లి అభ్యర్థన, వారి ప్రయాణానికి సహాయం చేయడానికి రష్యా ప్రభుత్వం సిద్ధంగా ఉండటం వంటివి.. ఇతర అంశాల కంటే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం విచారణ సందర్భంగా, రష్యా మహిళ రెండో కుమార్తెకు సంబంధించిన డీఎన్‌ఏ నివేదిక అందిందని, దానిని రష్యా ప్రభుత్వానికి అందజేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్ కోర్టుకు తెలియజేశారు. దీని ఆధారంగా, రష్యా ప్రభుత్వం వారికి పౌరసత్వం, రష్యాకు ప్రయాణించడానికి అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసిందని వివరించారు.