బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు లేదంటూ వార్తలు బయటకు వచ్చిన వేళ.. మరోసారి రాజకీయం వేడెక్కింది. రాహుల్‌తో సీఎం సిద్దరామయ్య సమావేశం కావాలనుకోవడం చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.
వివరాల మేరకు.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంటూ నెలకొన్న నిరంతర గందరగోళం గురించి బయట పడేందుకు సీఎం సిద్ధరామయ్య ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుండి స్పష్టత కోరుతూ సిద్ధరామయ్య ఆయనతో సమావేశం కావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారని ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ సమావేశం కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే.. డీకే శివకుమార్ సహా ఆయన మద్దతుదారులకు అవకాశం ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఎలాంటి అంతర్గత సంక్షోభం లేదని పదేపదే ఖండిస్తోంది. అంతర్గత సమస్యలను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేశారు. ఇక, అంతకుముందు కూడా సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సీఎం మార్పు విషయంలో స్పందించారు. ఇద్దరూ విభేదాల నివేదికలను నిరంతరం ఖండిస్తున్నారు. తాను పార్టీ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నానని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు, రొటేషనల్ ముఖ్యమంత్రి ఏర్పాటుకు సంబంధించిన వాదనలను తోసిపుచ్చారు.
రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం ఎలాంటి గొడవ లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. అనవసరమైన ప్రశ్నలతో గందరగోళం సృష్టించకండి అంటూ మీడియాపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో అసలు సిసలైన కుర్చీ పోరు మొదలవుతుందని బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన ప్రభుత్వానికి, పదవికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లు తామే సుస్థిర పాలన అందిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
అసలు గొడవ ఎందుకు వచ్చింది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తైన క్రమంలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. గత నవంబర్ 20తో ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో రెండున్నరేళ్లు దాటింది. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. దీని ప్రకారం, సగం కాలం సిద్ధూ, మిగతా సగం డీకే సీఎంగా ఉంటారని టాక్. ఇప్పుడు ఆ సమయం దాటడంతో బీజేపీ దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. "సంక్రాంతి తర్వాత చూడండి, కాంగ్రెస్ కుర్చీలాట మొదలవుతుంది" అని బీజేపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయి. దీనిపైనే సిద్ధరామయ్య సీరియస్‌గా స్పందించారు. "అసలు గొడవ ఎక్కడుంది? మీరే (మీడియా) సృష్టిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


