Bengaluru Floods: అందుకే బెంగళూరులో వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై

Karnataka CM Bommai Explain Why Bengaluru Flooding Much - Sakshi

వరదల్లో బెంగళూరు.. ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. తాగునీటి-విద్యుత్‌ కొరతతో అవస్థలు పడుతున్నారు నగరవాసులు. ఈ తరుణంలో సహాయక చర్యలపైనా రాజకీయ విమర్శలు రావడంతో.. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు.

బెంగళూరు వర్షాలు-వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దానిని దాచలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలూ ఓ కారణమే. అంతేకాదు నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కూడా కారణమని ఆరోపిస్తున్నారు ఆయన.  

నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వ తీరే. తలాతోక లేకుండా పాలించారు వాళ్లు. ఎటు పడితే అటు కట్టడాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. చెరువుల నిర్వాహణను ఏనాడూ పట్టించుకోలేదు. పైగా అవినీతితో చెరువు, కుంటలల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. అందుకే నగరం ఇవాళ నీట మునిగింది. అయినప్పటికీ  ఆటంకాలకు దాటుకుని ఎలాగైనా నగరంలోని పరిస్థితులను పునరుద్ధరిస్తాం. అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారాయన. 

కర్ణాటక.. ప్రత్యేకించి బెంగళూరులో ఈ తరహా వర్షాలు మునుపెన్నడూ కురిసింది లేదు. గత 90 ఏళ్లలో రికార్డు స్థాయిలో వానలు కురవడం ఇదే. చెరువులన్నీ నిండిపోయాయి. నాలాలు నింగి.. వరద నీరు ఓవర్‌ఫ్లో అయ్యింది. కొన్ని కట్టలు తెగిపోయాయి. చిన్నచిన్న ప్రాంత్లాలో నాలాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అక్రమకట్టడాలు కూడా ఇందుకు కారణాలయ్యాయి. దాదాపు ప్రతీ రోజూ కురుస్తుండం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పారాయన. 

బెంగళూరు వరదలను ఛాలెంజ్‌గా తీసుకుని.. అధికారులు, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు నిరంతరాయం పని చేస్తున్నట్లు వెల్లడించారాయన. పరిస్థితి చక్కబడగానే అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారాయన.  మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరు వరదల విషయంలో ప్రభుత్వందే తప్పని విమర్శిస్తోంది. ఈ మేరకు వరద నీళ్లలోనే నిరసనలు తెలుపుతున్నారు అక్కడి నేతలు. 

ఇదీ చదవండి: స్కూటీ స్కిడ్‌ అయ్యి పోల్‌ పట్టుకుంది.. విద్యుద్ఘాతంతో యువతి మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top