ఎన్ని నోళ్లు మూయించగలరు?

Kangana Ranaut attacks Maharashtra CM Uddhav Thackeray - Sakshi

మహారాష్ట్ర సీఎం ఠాక్రేపై కంగన మండిపాటు

శివసేన సోనియా సేనగా మారింది

అధికారం కోసం సిద్ధాంతాన్ని గాలికొదిలేసిందని వ్యాఖ్య

ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు.  ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్‌ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు.

శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్‌ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది.  

కంగనపై ఫిర్యాదు నమోదు
ఉద్ధవ్‌పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్‌ స్టేషన్లో బుధవారం నితిన్‌ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని  డీసీపీ ప్రశాంత్‌ కదమ్‌ తెలిపారు.

అది అక్రమ నిర్మాణమే
కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది.

గవర్నర్‌ అసంతృప్తి
కంగన రనౌత్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్‌ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్‌ సన్నిహితులు తెలిపారు.

కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ
కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్‌పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు.   శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top