
టీఎంసీలో అంతర్గత విభేదాలు
కోల్‌కతా: లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ టీఎంసీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. సభలో ఎంపీల మధ్య సమన్వయం లేదంటూ అన్యాయంగా తనను నిందిస్తున్నారంటూ ఆవేదన చెందారు. పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు లోక్‌సభ సమావేశాలకు రావడమే అరుదని చెప్పారు. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం పార్టీ ఎంపీలతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె పార్లమెంటరీ విభాగంలో సమన్వయం కొరవడిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంటరీ పార్టీలో సమన్వయం లేదంటూ వర్చువల్ మీటింగ్‌లో దీదీ(మమత)అన్నారు. అందుకు నేనే కారణం. అందుకే, రాజీనామా చేస్తున్నా’అని వివరించారు.
పార్లమెంట్‌కు తరచూ డుమ్మాకొట్టే వారిని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని వదిలేసి ప్రతిదానికీ తననే తప్పుపట్టడంపై కల్యాణ్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇంతకుముందు, మరో ఎంపీ కీర్తి ఆజాద్‌తో కల్యాణ్ బెనర్జీ వివాదం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయని చెబుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ ఘటనే తాజా పరిణామాలకు దారి తీసిందని చెబుతున్నారు. ఓ ఎంపీ తనను వ్యక్తిగతంగా అవమానించినా పార్టీ నాయకత్వం మౌనందాల్చిందంటూ పరోక్షంగా మహువా మొయిత్రా నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభ ఎంపీల మధ్య పోట్లాటలు, తగవులు జరుగుతున్నాయని దీదీ అంటున్నారు. నన్ను దూషించిన వారిని వదిలేయాలా? ఈ విషయం నేను నాయకత్వానికి చెప్పినా, నాదే తప్పంటున్నారు. మమతా బెనర్జీని ఆమె ఇష్టమొచ్చినట్లుగా పార్టీని నడుపుకోనివ్వండి’అంటూ నిర్వేదం చెందారు.
టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో కీలక మార్పు
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధిష్టానం పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు జరిగాయి. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి లోక్‌సభ నేతగా బాధ్యతలు అప్పగించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తిరిగి వచ్చే వరకు ఆయన స్థానంలో అభిషేక్ కొనసాగనున్నారు.