
సూళ్లూరుపేట: బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఇస్రో వారి ఎల్‌వీఎం3 మార్క్–5 రాకెట్ ద్వారా 6,500 కేజీల అత్యంత బరువైన బ్లూ బర్డ్ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. బ్లూబర్డ్ త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. షార్ చరిత్రలో ఇది భారీ ప్రయోగమనే చెప్పాలి.
బ్లూబర్డ్ ప్రత్యేకతలివీ..
ఇది అమెరికన్ కమ్యూనికేషన్ ఉప గ్రహం. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పని చేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వినూత్నమైన యాంటెన్నా ఉంటుంది. ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఇది ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపైని టవర్లపై ఆధారఫడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్‌మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యూలార్ బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు.