breaking news
Blue Bird Company
-
ఇక ఎక్కడికైనా హలో హలో!
హిమాలయాల్లోని చొరరాని అతి శీతల ప్రాంతాలు. రాజస్తాన్ థార్ ఎడారిలోని అతి మారుమూల మంచు దిబ్బలు. మధ్యప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతం. సుదూర సాగర జలాలు. ఇలా టవర్ కనెక్టివిటీ ఊసే ఉండని ప్రాంతాల్లో కూడా త్వరలో మొబైల్ మోగనుంది. అలాంటి ప్రాంతాలకు కూడా మొబైల్ కనెక్టివిటీ అందించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నడుం బిగించింది. ఇందుకు వీలు కల్పించే బ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహాన్ని బుధవారం ప్రయోగించనుంది. ఈ రంగంలో విశేష అనుభవమున్న అమెరికాకు చెందిన ప్రసిద్ధ ప్రైవేట్ కంపెనీ ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని తయారు చేయడం విశేషం. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం బ్లూ బర్డ్ బ్లాక్2 ప్రయోగం జరగనుంది. ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రో బాహుబలిగా పేరొందిన లాంచ్ వెహికల్ మార్క్ (ఎల్ఎంవీ3–ఏం6) వాహక నౌక ఉదయం 8:54 గంటలకు ఉపగ్రహంతో నింగిలోకి దూసుకుపోనుంది. ఈ వాహక నౌకకు ఇది 9వ మిషన్. ఇక ఇస్రో ఇది ఏకంగా 101వ ఉపగ్రహ ప్రయోగం కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.భూ కక్ష్యలో పెద్ద యాంటెన్నాబ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహం ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు. అది అందించే సేవలూ విశేషమైనవే...→ ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 6,100 కిలోలు! భారత్ నుంచి ఇప్పటిదాకా ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్ గా ఇది రికార్డుకెక్కనుంది.→ సాధారణ స్మార్ట్ ఫోన్లన్నీ దీని సేవలను నేరుగా పొందవచ్చు. ప్రత్యేకమైన హార్డ్ వేర్ గానీ, అదనపు యాంటెన్నా వంటివాటి అవసరం ఎంతమాత్రమూ ఉండదు.→ మారుమూలల్లో మాత్రమే కాదు, సంప్రదాయ సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉందని విమాన ప్రయాణాలు తదితర చోట్ల కూడా ఇది భేషుగ్గా సేవలు అందించగలదు.→ బ్లూ బర్డ్ బ్లాక్2 భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించిన మీదట అక్కడ ఏకంగా 223 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన యాంటెన్నాను ఉపగ్రహం ఏర్పాటు చేయనుంది.→ అక్కడ మోహరించిన అతి పెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్స్ యాంటెన్నాగా ఇది రికార్డు సృష్టించనుంది.→ బ్లూ బర్డ్ బ్లాక్2ను రూపొందించిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీకి ఈ రంగంలో విశేషమైన అనుభవముంది.→ బ్లూ బర్డ్ ఉపగ్రహాల ద్వారా అమెరికాలో అన్ని మారుమూల ప్రాంతాలకూ మొబైల్ సేవల విస్తరణలో నాసాకు ఈ కంపెనీ దోహదపడింది.→ గత బ్లూ బర్డ్ ఉపగ్రహాలతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ అందించే సామర్థ్యంతో బ్లాక్2ను రూపొందించడం విశేషం.→ సెకనుకు 120 మెగాబైట్ల వేగంతో మొబైల్ సేవలు అందుతాయి.→ 4జీ, 5జీ నెట్ వర్కులు రెండింట్లోనూ వాయిస్ కాల్స్, మెసేజింగ్, డేటా మార్పిడితో పాటు అంతరాయం లేని వీడియో స్ట్రీమింగ్ సాధ్యపడుతుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బ్లూబర్డ్’ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం
సూళ్లూరుపేట: బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఇస్రో వారి ఎల్వీఎం3 మార్క్–5 రాకెట్ ద్వారా 6,500 కేజీల అత్యంత బరువైన బ్లూ బర్డ్ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. బ్లూబర్డ్ త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. షార్ చరిత్రలో ఇది భారీ ప్రయోగమనే చెప్పాలి. బ్లూబర్డ్ ప్రత్యేకతలివీ.. ఇది అమెరికన్ కమ్యూనికేషన్ ఉప గ్రహం. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పని చేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వినూత్నమైన యాంటెన్నా ఉంటుంది. ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఇది ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపైని టవర్లపై ఆధారఫడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్‌జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యూలార్ బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు. -
బ్లూ బర్డ్ నుంచి ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లు
హైదరాబాద్: బ్లూ బర్డ్ కంపెనీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లను హైదరాబాద్ మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్లను రూపొందించామని బ్లూ బర్డ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ, వాణిజ్య అవసరాలనుకనుగుణంగా 15 రకాల మోడళ్లను అందిస్తున్నామని బ్లూ బర్డ్ ఎండీ, ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. వీటి ధరలు రూ.16,000 నుంచి రూ.60,000 రేంజ్లో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత నాణ్యత గల ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వాటర్ ప్యూరిఫైర్లను అందిస్తున్నామని వివరించారు.


