నెట్‌వర్క్ లేని చోట్లా ఇక మొబైల్ సేవలు
బ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహంతో సుసాధ్యం
బుధవారం ప్రయోగించనున్న ఇస్రో
పూర్తయిన అన్ని ఏర్పాట్లు
హిమాలయాల్లోని చొరరాని అతి శీతల ప్రాంతాలు. రాజస్తాన్ థార్ ఎడారిలోని అతి మారుమూల మంచు దిబ్బలు. మధ్యప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతం. సుదూర సాగర జలాలు. ఇలా టవర్ కనెక్టివిటీ ఊసే ఉండని ప్రాంతాల్లో కూడా త్వరలో మొబైల్ మోగనుంది. అలాంటి ప్రాంతాలకు కూడా మొబైల్ కనెక్టివిటీ అందించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నడుం బిగించింది.
ఇందుకు వీలు కల్పించే బ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహాన్ని బుధవారం ప్రయోగించనుంది. ఈ రంగంలో విశేష అనుభవమున్న అమెరికాకు చెందిన ప్రసిద్ధ ప్రైవేట్ కంపెనీ ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని తయారు చేయడం విశేషం. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం బ్లూ బర్డ్ బ్లాక్2 ప్రయోగం జరగనుంది.
ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రో బాహుబలిగా పేరొందిన లాంచ్ వెహికల్ మార్క్ (ఎల్‌ఎంవీ3–ఏం6) వాహక నౌక ఉదయం 8:54 గంటలకు ఉపగ్రహంతో నింగిలోకి దూసుకుపోనుంది. ఈ వాహక నౌకకు ఇది 9వ మిషన్. ఇక ఇస్రో ఇది ఏకంగా 101వ ఉపగ్రహ ప్రయోగం కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
భూ కక్ష్యలో పెద్ద యాంటెన్నా
బ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహం ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు. అది అందించే సేవలూ విశేషమైనవే...
→ ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 6,100 కిలోలు! భారత్ నుంచి ఇప్పటిదాకా ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్ గా ఇది రికార్డుకెక్కనుంది.
→ సాధారణ స్మార్ట్ ఫోన్లన్నీ దీని సేవలను నేరుగా పొందవచ్చు. ప్రత్యేకమైన హార్డ్ వేర్ గానీ, అదనపు యాంటెన్నా వంటివాటి అవసరం ఎంతమాత్రమూ ఉండదు.
→ మారుమూలల్లో మాత్రమే కాదు, సంప్రదాయ సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉందని విమాన ప్రయాణాలు తదితర చోట్ల కూడా ఇది భేషుగ్గా సేవలు అందించగలదు.
→ బ్లూ బర్డ్ బ్లాక్2 భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించిన మీదట అక్కడ ఏకంగా 223 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన యాంటెన్నాను ఉపగ్రహం ఏర్పాటు చేయనుంది.
→ అక్కడ మోహరించిన అతి పెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్స్ యాంటెన్నాగా ఇది రికార్డు సృష్టించనుంది.
→ బ్లూ బర్డ్ బ్లాక్2ను రూపొందించిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీకి ఈ రంగంలో విశేషమైన అనుభవముంది.
→ బ్లూ బర్డ్ ఉపగ్రహాల ద్వారా అమెరికాలో అన్ని మారుమూల ప్రాంతాలకూ మొబైల్ సేవల విస్తరణలో నాసాకు ఈ కంపెనీ దోహదపడింది.
→ గత బ్లూ బర్డ్ ఉపగ్రహాలతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ అందించే సామర్థ్యంతో బ్లాక్2ను రూపొందించడం విశేషం.
→ సెకనుకు 120 మెగాబైట్ల వేగంతో మొబైల్ సేవలు అందుతాయి.
→ 4జీ, 5జీ నెట్ వర్కులు రెండింట్లోనూ వాయిస్ కాల్స్, మెసేజింగ్, డేటా మార్పిడితో పాటు అంతరాయం లేని వీడియో స్ట్రీమింగ్ సాధ్యపడుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


