బెంగాల్‌కు అక్రమ చొరబాట్లే అతిపెద్ద సవాలు
వారివల్ల జనాభా స్థితిగతుల్లో మార్పులు.. ఘర్షణలు
అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పిస్తాం
చట్టవిరుద్ధమైన వలసలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం
మాల్డా బహిరంగ సభలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
మాల్డా: అక్రమ చొరబాట్లే పశ్చిమ బెంగాల్‌కు అతిపెద్ద సవాలుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పొరుగుదేశం నుంచి వెల్లువెత్తుతున్న చొరబాట్ల కారణంగా ఇక్కడ జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చొరబాట్ల వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉందని మండిపడ్డారు. శరణార్థులుగా వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు.
తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ రాజ్ రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక్కడి పాలకులు చొరబాటుదార్లతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. అక్రమంగా వచ్చినవారిని బయటకు పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తేలి్చచెప్పారు. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సైతం చొరబాటుదార్లను భరించడం లేదని, బయటకు వెళ్లగొడుతున్నాయని గుర్తుచేశారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి వచ్చాక చొరబాటు దార్ల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన వలసలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలి
‘‘చొరబాటుదారుల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో జనాభా స్థితిగతులు మారిపోతున్నాయి. చాలాచోట్ల ఇన్నాళ్లూ అధికంగా వినిపించిన భాష కూడా మారుతోంది. మరో భాష ఆధిపత్యం కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. అక్రమంగా మనదేశంలోకి వచ్చినవారు ఘర్షణలకు కారణమవుతున్నారు. బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, చొరబాటుదార్ల మధ్య బంధాన్ని విచి్ఛన్నం చేయాలి. ఇతర దేశాల్లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటూ మనదేశంలోకి వచ్చినవారికి రక్షణ కల్పిస్తాం. మతువా వర్గం ప్రజలు అస్సలు ఆందోళన చెందొద్దు.
అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే
బెంగాల్‌లో పరివర్తన్‌కు సమయం ఆసన్నమైంది. తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే. పేదల జీవితాలకు ముప్పుగా మారిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. బెంగాల్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సుపరిపాలన అందిస్తోంది. ఇక బెంగాల్‌లోనూ అధికారంలోకి రావడం, సుపరిపాలన అందించడం తథ్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయం. పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి దక్కనివ్వడం లేదు.
తృణమూల్ కాంగ్రెస్ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ప్రజల బాగు కోసం కేంద్రం ఇస్తున్న సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేస్తున్నారు. అందుకే ప్రజాకంటక తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి. బీజేపీ అభివృద్ధి మోడల్ పట్ల యువతలో విశ్వాసం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మున్సిపల్, స్థానిక
సంస్థల ఎన్నికల్లో బీజేపీ అపూర్వమైన విజయం సాధించింది. గతంలో మేము బలహీనంగా ఉన్నచోట ఇప్పుడు బలోపేతమయ్యాం. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, రైతులను నూతన అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు.


