
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది.
సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది.
ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.
